Vande Bharat Express: రికార్డు దూరం ప్రయాణించే లాంగెస్ట్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఇదే.. టికెట్ ఎంతంటే?
దీపావళి పండగ సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ఢిల్లీ-పాట్నా మార్గంలో నడుపుతున్నారు. ఇది ఇప్పటివరకు అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించే వందేభారత్ రైలుగా రికార్డు సృష్టించింది. ఈ ప్రత్యేక రైలు ఢిల్లీ నుంచి ఉదయం 8.25 గంటలకు బయలుదేరి, దాదాపు 994 కిలోమీటర్ల ప్రయాణం చేసి సుమారు 11 గంటల 30 నిమిషాల అనంతరం రాత్రి 8 గంటలకు పాట్నా చేరుకుంటుంది. ప్రయాగ్‌రాజ్, కాన్పూర్, డీడీయూ వంటి కీలక స్టేషన్లలో ఈ రైలు ఆగనుంది.
సోమ, గురు, శనివారాల్లో దిల్లీకి
ఈ ప్రత్యేక రైలు బుధ, శుక్ర, ఆదివారాల్లో దిల్లీ నుంచి బయలుదేరగా, పాట్నా నుంచి సోమ, గురు, శనివారాల్లో ఢిల్లీకి వెళ్తుంది. పాట్నా నుంచి ఈ రైలు ఉదయం 7.30 గంటలకు బయలుదేరి, రాత్రి 7 గంటలకు దిల్లీ చేరుకుంటుంది. అయితే, ఈ రైలు పూర్తిగా డే జర్నీ సౌకర్యాన్ని కలిగి ఉండడంతో స్లీపర్ క్లాస్ అందుబాటులో లేదు. వందేభారత్ రైలు ఛార్జీలు కూడా ప్రకటించింది. ఏసీ చైర్ కార్ టికెట్ ధర రూ. 2,575 కాగా, ఎగ్జిక్యూటివ్ చైర్‌కార్ టికెట్ ధర రూ. 4,655 గా నిర్ణయించారు. పుణెకు కూడా ప్రత్యేక వందేభారత్ రైళ్లు నవంబర్ 1, 3, 6 తేదీల్లో దిల్లీ నుంచి ప్రయాణించనున్నాయి.
8 గంటల్లో ప్రయాణం పూర్తి
రిటర్న్ సర్వీసులు నవంబర్ 2, 4, 7 తేదీల్లో ఉంటాయి. గతంలో ఢిల్లీ-వారణాసి మార్గంలో 771 కిలోమీటర్ల దూరంతో లాంగెస్ట్ వందేభారత్ రైలు నడిచింది. దానిని 8 గంటల్లో పూర్తి చేసింది. త్వరలోనే ఈ రూట్లో స్లీపర్ వందేభారత్ రైలును కూడా ప్రారంభించనున్నారు, రాత్రి ప్రయాణాల కోసం ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది.