Hyderabad: హైదరాబాద్‌లో డోర్‌డాష్ తొలి కార్యాలయం.. రెండేళ్లలో 3,000 ఉద్యోగాల లక్ష్యం
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాకు చెందిన ప్రముఖ లోకల్ కామర్స్ ప్లాట్‌ఫామ్ డోర్‌డాష్ భారత్‌లో తన తొలి కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించింది. హైటెక్ సిటీలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం ద్వారా సంస్థ తన కార్యకలాపాలను 500 మంది ఉద్యోగులతో ప్రారంభించింది. రానున్న రెండేళ్లలో హైదరాబాద్ కేంద్రంలోని ఉద్యోగుల సంఖ్యను 3,000 మందికి పైగా పెంచాలని డోర్‌డాష్ లక్ష్యంగా పెట్టుకుంది.
వివరాలు
సీఎక్స్‌ఐ, పరిపాలనా విభాగాలతో ప్రారంభం
హైదరాబాద్ కేంద్రంలో తొలిదశలో కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ అండ్ ఇంటెగ్రిటీ (CXI), జనరల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ విభాగాలు కార్యకలాపాలు నిర్వహించనున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా డోర్‌డాష్‌కు ఉన్న అంతర్గత సీఎక్స్‌ఐ సర్వీస్ సెంటర్లలో హైదరాబాద్ కేంద్రం మూడోది.
అమెరికాలోని టెంపీ, మెక్సికోలోని మెక్సికో సిటీ తర్వాత ఈ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది.
ప్రపంచవ్యాప్తంగా సంస్థ కార్యకలాపాలకు హైదరాబాద్ కేంద్రం కీలకంగా వ్యవహరిస్తుందని డోర్‌డాష్ వెల్లడించింది.
వినియోగదారులు, వ్యాపార సంస్థలు, డెలివరీ భాగస్వాములకు మెరుగైన సేవలు అందించడంలో ఈ కేంద్రం ముఖ్యమైన పాత్ర పోషించనుంది.
వివరాలు
5.6 కోట్లకు పైగా నెలవారీ వినియోగదారులు
డోర్‌డాష్ ప్లాట్‌ఫామ్‌కు ప్రపంచవ్యాప్తంగా 5.6 కోట్లకు పైగా నెలవారీ యాక్టివ్ వినియోగదారులు ఉన్నారు.
40కిపైగా దేశాల్లో సంస్థ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. 2025లో డోర్‌డాష్ మార్కెట్‌ప్లేస్ గ్రాస్ ఆర్డర్ విలువ 100 బిలియన్ డాలర్లకు పైగా నమోదైంది.
హైటెక్ సిటీలో ఏర్పాటు చేసిన డోర్‌డాష్ కార్యాలయాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బుధవారం ప్రారంభించారు.
వివరాలు
2029 నాటికి జీసీసీల్లో 10 లక్షల ఉద్యోగాలు
కార్యాలయ ప్రారంభ కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ప్రస్తుతం దాదాపు 500 గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు (జీసీసీలు) ఉన్నాయని తెలిపారు.
నగరంలో మరో 100జీసీసీలను ఏర్పాటు చేయడంతోపాటు లక్షకు పైగా ప్రత్యక్ష ఉద్యోగాలు, 3లక్షలకు పైగా పరోక్ష ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు.
ప్రస్తుతం హైదరాబాద్‌లోని జీసీసీల్లో 5 లక్షల మందికి పైగా ఉద్యోగాలు చేస్తున్నారని,2029 నాటికి ఈ సంఖ్య 10 లక్షలకు చేరుతుందని అంచనా వేస్తున్నట్లు శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.
ఫార్చ్యూన్ 500 సంస్థలతోపాటు కొత్త జీసీసీలను ఆకర్షిస్తున్న భారతీయ నగరాల్లో హైదరాబాద్ తన కీలక స్థానాన్ని కొనసాగిస్తోందన్నారు.
హైదరాబాద్ జీసీసీ ఎకోసిస్టమ్‌లోకి డోర్‌డాష్ రావడంతో హైపర్ లోకల్ డిజిటల్ కామర్స్ రంగం కూడా చేరిందని చెప్పారు.
వివరాలు
హైదరాబాద్ ప్రతిభకు గుర్తింపు
హైదరాబాద్‌లో డోర్‌డాష్ పెట్టుబడి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల రంగానికి ముఖ్యమైన పరిణామమని శ్రీధర్‌బాబు అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న డోర్‌డాష్ హైదరాబాద్‌ను ఎంపిక చేసుకోవడం నగరంలోని ప్రతిభ, సాంకేతిక సామర్థ్యాలకు గుర్తింపుగా పేర్కొన్నారు.
హైదరాబాద్ కేంద్రాన్ని 3,000 మందికి పైగా ఉద్యోగులతో విస్తరించడం ద్వారా హైపర్ లోకల్ కామర్స్, కస్టమర్ ఎక్స్‌పీరియన్స్, టెక్నాలజీ, ఆపరేషన్స్ వంటి రంగాల్లో ప్రపంచస్థాయి సామర్థ్యాలు నగరానికి అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డోర్‌డాష్ సీఎఫ్‌వో రవి ఇనుకొండ, వర్క్‌ఫోర్స్ స్ట్రాటజీ అండ్ టాలెంట్ ఎక్విజిషన్ ఆపరేషన్స్ సీనియర్ డైరెక్టర్ జెన్నా కోహ్నెకె, ప్రభుత్వ ఐటీ సలహాదారు సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.