LOADING...
Pakistan Spying: పాక్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐకి గూఢచర్యం.. డీఆర్డీఓ జైసల్మేర్ గెస్ట్ హౌస్ మేనేజర్ అరెస్టు 
డీఆర్డీఓ జైసల్మేర్ గెస్ట్ హౌస్ మేనేజర్ అరెస్టు

Pakistan Spying: పాక్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐకి గూఢచర్యం.. డీఆర్డీఓ జైసల్మేర్ గెస్ట్ హౌస్ మేనేజర్ అరెస్టు 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 13, 2025
09:26 am

ఈ వార్తాకథనం ఏంటి

రాజస్థాన్ రాష్ట్రంలోని జైసల్మేర్‌లో పాకిస్థాన్ గూఢచారిగా అనుమానిస్తున్న వ్యక్తిని సీఐడీ (ఇంటెలిజెన్స్ విభాగం) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన ఇవాళ చోటు చేసుకుంది. వివరాల ప్రకారం..ఉత్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లా, పల్యూన్‌కు చెందిన మహేంద్ర ప్రసాద్‌ (32) జైసల్మేర్‌లోని చందన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌లో డీఆర్‌డీఓ (DRDO) గెస్ట్‌హౌస్ మేనేజర్‌గా కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్నాడు. అయితే, అతడు పాక్ ఇంటెలిజెన్స్ హ్యాండ్లర్‌తో రహస్య సంబంధాలు కొనసాగిస్తూ, భారత రక్షణ వ్యవస్థలకు సంబంధించిన గోప్య సమాచారాన్ని లీక్ చేస్తున్నాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. సీఐడీ(సెక్యూరిటీ)ఐజీ డాక్టర్ విష్ణుకాంత్‌ తెలిపిన వివరాల ప్రకారం.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నేపథ్యంతో,రాజస్థాన్ సీఐడీ ఇంటెలిజెన్స్ విభాగం దేశానికి విరుద్ధంగా లేదా విధ్వంసకరంగా ఉండే చర్యలపై కట్టుదిట్టమైన నిఘా నిర్వహిస్తోంది.

వివరాలు 

భారత సైనిక అధికారుల కదలికలు, కార్యక్రమాలపై సమాచారం

ఈ క్రమంలోనే డీఆర్‌డీఓ గెస్ట్‌హౌస్‌లో కాంట్రాక్ట్ బేస్‌‌లో పనిచేస్తున్న మహేంద్ర ప్రసాద్ గూఢచర్యం గురించి వెలుగులోకి వచ్చిందనన్నారు. దర్యాప్తులో,అతడు ఎలాంటి అనుమానం రాకుండా సోషల్ మీడియా ద్వారా పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అధికారులతో సంబంధాలు కొనసాగించినట్టు బయటపడింది. అంతేకాకుండా,చందన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌కు క్షిపణి, ఆయుధ పరీక్షల కోసం వచ్చే డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలు,భారత సైనిక అధికారుల కదలికలు, కార్యక్రమాలపై సమాచారం సేకరించి తన హ్యాండ్లర్‌కు పంపినట్టు నిర్ధారణ అయింది. ఈ ఆధారాల మేరకు సీఐడీ అధికారులు మహేంద్ర ప్రసాద్‌ను అరెస్ట్ చేసి, అతని సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం, అతడు పాక్ ఐఎస్ఐలో ఎవరితో సంప్రదింపులు జరిపాడు, ఏ రకమైన గోప్య సమాచారం అందించాడు అనే విషయాలపై విచారణ కొనసాగుతోంది.