బీజేపీ చీఫ్ నాకెందుకివ్వరు అంటున్న ఎమ్మెల్యే రఘునందన్.. పార్టీలో రాజుకుంటున్న అగ్గి
తెలంగాణ బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు బహిర్గతమవుతున్నాయి. గత పదేళ్లుగా పార్టీ కోసం కష్టపడుతున్న తనను నిర్లక్ష్యంగా చూస్తున్నారని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు భగ్గుమన్నారు. అంతటితో ఆగకుండా తెలంగాణ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్ పై సంచలన ఆరోపణలు చేశారు. త్వరలో పార్టీ అధ్యక్షుడు మారిపోతున్నాడంటూ వస్తున్న వార్తలు నిజమేనన్నారు. అయితే మునుగోడులో రూ.100 కోట్లు ఖర్చు పెట్టినా పార్టీ గెలవలేకపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. అదే వంద కోట్లు తనకిస్తే తెలంగాణను దున్నేసేవాడినని స్పష్టం చేశారు. ఎన్నికల్లో భార్య పుస్తెల తాడు అమ్మి గెలిచిన బండి సంజయ్, ఓ పేపర్ యాడ్ కోసం రూ.100 కోట్ల ఎక్కడి నుంచి వచ్చాయంటూ రఘునందన్ ప్రశ్నించారు.
తాను గెలిచాను కాబట్టే ఈటల రాజేందర్ బీజేపీలోకి వచ్చారు
దుబ్బాక నుంచి తాను గెలిచాను కాబట్టే ఈటల రాజేందర్ బీజేపీలోకి వచ్చారన్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా తాను పనికిరానా అంటూ రాష్ట్ర పార్టీ నాయకత్వాన్ని ఇరుకున పెట్టేశారు. తన కులమే తనకు శాపంగా మారిందన్న రఘు, తాను వెలమ కులస్థుడ్ని కాబట్టే అధ్యక్ష పదవి దక్కడం లేదని దుమారం రేపారు. రాబోయే ఎన్నికల్లో ఈటల బొమ్మ, తన బొమ్మ లేకుండా బీజేపీ గెలవడం కష్టమన్నారు. పార్టీ అధ్యక్ష పదవి గానీ, ఫ్లోర్ లీడర్ గానీ లేదా జాతీయ అధికార ప్రతినిధి పదవుల్లో ఏదో ఒకటి తనకివ్వాలని రఘనందన్ పట్టుబడుతున్నారు. అయితే దుబ్బాక నుంచి మరోసారి గెలుస్తానని, పదేళ్లలో తాను అందరికంటే ఎక్కువగా కష్టపడినట్లు తెలిపారు. సేవకు ప్రతిఫలం దక్కకపోతే నడ్డాకు ఫిర్యాదు చేస్తానన్నారు.