
Delhi: దిల్లీలో దుమ్ము తుపానుతో విమాన రాకపోకలకు అంతరాయం.. 12 గంటలు ఆలస్యం
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీ విమానాశ్రయంలో శుక్రవారం ప్రతీకూల వాతావరణ పరిస్థితుల కారణంగా పలు విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు తీవ్రమైన అసౌకర్యాన్ని ఎదుర్కొన్నారు.
విమానాశ్రయంలో గంటల కొద్ది నిరీక్షించాల్సి వచ్చిన ప్రయాణికులు తమ ఆవేదనను ఎక్స్ వేదికగా వ్యక్తపరిచారు. దేశ రాజధానిలోని కొన్ని ప్రాంతాల్లో దుమ్ము తుపానులతో పాటు మోస్తరు వర్షం కురిసింది.
బలమైన ఈదురుగాలులు వీచడంతో కొన్ని ప్రాంతాల్లో చెట్లు, కొమ్మలు విరిగిపడ్డాయి.
ఈ పరిస్థితుల మధ్య విమానాశ్రయ సిబ్బంది ముందు జాగ్రత్తగా దాదాపు 15 విమానాలను ఇతర విమానాశ్రయాల దిశగా మళ్లించారు. దీనిపై అధికారికంగా విమానాశ్రయ అధికారులు సమాచారం ఇచ్చారు.
Details
12 గంటలు పాటు ఇక్కట్లు
ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా, ఇండిగో వంటి ప్రముఖ విమానయాన సంస్థలు తమ ప్రయాణికులకు సలహాలు (అడ్వైజరీలు) జారీ చేశాయి.
అయితే విమానాల ఆలస్యం కారణంగా ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. "దాదాపు 12 గంటలుగా విమానాశ్రయంలోనే ఎదురు చూస్తున్నామని ఒక మహిళ వాపోయారు.
ముంబైకి వెళ్లేందుకు ఉదయం 12 గంటల విమానం బుక్ చేసుకున్నా. అయితే ఆ విమానం కాకుండా మరో విమానానికి మారమన్నారు. దానిలో కూర్చొని నాలుగు గంటలపాటు వేచిచూసాం.
ఆ తర్వాత దింపేశారని ఓ ప్రయాణికుడు వివరించారు. అంతర్జాతీయ విమానాశ్రయం అయినప్పటికీ ప్రయాణికులకు సమయానికి సరైన సమాచారం ఇవ్వకపోవడంపై పలువురు విమర్శలు చేశారు.