Page Loader
Bharat Forecast System: వాతావరణ ముందస్తు సమాచారం పక్కాగా చెప్పేలా అందుబాటులోకి మరో వ్యవస్థ.. జాతికి అంకితం చేసిన కేంద్రమంత్రి..! 
వాతావరణ ముందస్తు సమాచారం పక్కాగా చెప్పేలా అందుబాటులోకి మరో వ్యవస్థ

Bharat Forecast System: వాతావరణ ముందస్తు సమాచారం పక్కాగా చెప్పేలా అందుబాటులోకి మరో వ్యవస్థ.. జాతికి అంకితం చేసిన కేంద్రమంత్రి..! 

వ్రాసిన వారు Sirish Praharaju
May 26, 2025
04:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో వాతావరణానికి సంబంధించి అత్యంత ఖచ్చితమైన ముందస్తు సమాచారాన్ని అందించగల మరో ఆధునిక వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. 'భారత్ ఫోర్‌కాస్ట్‌ సిస్టమ్‌' అనే ఈ నూతన వ్యవస్థను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ దేశ ప్రజలకు అంకితం చేశారు. ఈ సరికొత్త వ్యవస్థ ద్వారా వాతావరణ మార్పులపై మరింత ముందుగానే అంచనాలు వేయడం సాధ్యపడనుంది. ఇప్పటివరకు వాతావరణ సమాచారాన్ని ఆరు కిలోమీటర్ల పరిధిలో మాత్రమే ఇవ్వగలిగితే, ఇకపై ఇది 12 కిలోమీటర్ల దూరం వరకు ముందస్తుగా అందించగలదని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది.

వివరాలు 

ఈ సంవత్సరం సగటు వర్షపాతం కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం 

ఈ వ్యవస్థ ద్వారా గ్రామస్థాయిలోనూ వాతావరణ అంచనాలను ఇవ్వడం వీలవుతుందని పుణెలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ (IITM) డైరెక్టర్ పేర్కొన్నారు. ఐఎండీ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ వ్యవస్థ ఐదురోజుల ముందుగానే ఖచ్చితమైన వాతావరణ సమాచారాన్ని ప్రజలకు అందించగలదు. ఈ సందర్భంగా ఐఎండీ డైరెక్టర్ మృతుంజయ్ మోహపాత్ర మాట్లాడుతూ, ఈ ఏడాది రుతుపవనాలు సాధారణం కంటే ఎనిమిది రోజులు ముందుగానే భారతదేశాన్ని తాకినట్లు తెలిపారు. అలాగే, గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం సగటు వర్షపాతం కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించారు. కొత్తగా ప్రవేశపెట్టిన గ్లోబల్ న్యూమరికల్ మోడల్ ఫోర్‌కాస్ట్‌ సిస్టమ్‌ అతి వర్షాలను కూడా సమర్థవంతంగా అంచనా వేయడంలో సహకరిస్తుందని అధికారులు తెలిపారు.

వివరాలు 

విపత్తులపై ముందస్తు హెచ్చరికలు

కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ 'భారత్ ఫోర్‌కాస్ట్‌ సిస్టమ్‌'ను దేశీయంగా అభివృద్ధి చేయడం జరిగింది అని, దీనిలో ముఖ్యపాత్ర పోషించిన ఐదుగురు మహిళా శాస్త్రవేత్తలు ఈ ప్రాజెక్టును విజయవంతంగా రూపొందించారని తెలిపారు. ఇది మహిళల సామర్థ్యానికి, దేశంలో వారి పాత్రకు నిదర్శనంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు, భారత వాతావరణ శాఖ దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలో నాల్గవ స్థానంలో నిలిపేందుకు ప్రభావితం చేసినట్లు పేర్కొన్నారు. ఇటీవల సంవత్సరాలలో విపత్తులపై ముందస్తు హెచ్చరికలు ఇవ్వడం, ఆర్థికంగా నష్టాలను తగ్గించడం వంటివి రూ.50వేల కోట్లకుపైగా ప్రయోజనాన్ని దేశానికి కలిగించాయని చెప్పారు.

వివరాలు 

అత్యధిక రిజల్యూషన్‌ గల వాతావరణ మోడల్‌

పుణెలోని ఐఐటీఎం అభివృద్ధి చేసిన ఈ ఫోర్కాస్ట్‌ మోడల్ ప్రపంచంలోనే అత్యధిక రిజల్యూషన్‌ గల వాతావరణ మోడల్‌గా గుర్తింపు పొందింది. ఇది 6 కిలోమీటర్ల స్థాయిలో వాతావరణ వివరాలను అంచనా వేసేందుకు అనుకూలంగా ఉంటుంది. ఈ విధంగా చిన్న స్థాయి వాతావరణ పరిణామాలపై కూడా ఖచ్చితమైన అంచనాలు వేసేందుకు ఇది సహాయపడుతుంది.