
Eco Town: హైదరాబాద్‌లో ఎకో టౌన్.. జపాన్ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం
ఈ వార్తాకథనం ఏంటి
జపాన్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని "తెలంగాణ రైజింగ్" ప్రతినిధి బృందం ఆదివారం కిటాక్యూషు నగరాన్ని సందర్శించింది.
పర్యావరణ హితంగా మారిన ఈ నగరం అభివృద్ధి తీరు సీఎం బృందాన్ని ఆకట్టుకుంది.
ఈ పర్యటనలో భాగంగా, హైదరాబాద్ నగరంలో 'ఎకో టౌన్' ఏర్పాటుకు దిశగా కీలక ఒప్పందాలను తెలంగాణ ప్రభుత్వం జపాన్‌కు చెందిన ప్రముఖ కంపెనీలతో కుదుర్చుకుంది.
వీటి ద్వారా వ్యర్థాల నిర్వహణ, పునరుత్పత్తి (రిసైక్లింగ్) పర్యావరణ పరిరక్షణ రంగాలలో భాగస్వామ్యం ఏర్పడనుంది.
కిటాక్యూషు నగర మేయర్ కజుహిసా టేకుచితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సహా ఉన్నతాధికారులు సమావేశమయ్యారు.
వివరాలు
ఎకో టౌన్ ప్రాజెక్టుకు సంబంధించి ఒప్పందాలు
ఈ సమావేశంలో పర్యావరణ అనుకూల సాంకేతిక పరిజ్ఞానం, పరిశుభ్రమైన నగర నిర్మాణ నమూనాలు, నదుల పునరుజ్జీవ విధానాలపై విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా, హైదరాబాద్ ఎకో టౌన్ ప్రాజెక్టుకు సంబంధించి పలు జపాన్ కంపెనీలతో తెలంగాణ ప్రభుత్వం పునరుత్తేజకర ఒప్పందాలను చేసుకుంది.
ఇందులో ఈఎక్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, పీ9 ఎల్‌ఎల్‌సీ, నిప్పాన్ స్టీల్ ఇంజినీరింగ్, న్యూ కెమికల్ ట్రేడింగ్, అమితా హోల్డింగ్స్ సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయి.
సీఎం సమక్షంలో రాష్ట్ర అధికారులు, ఆయా కంపెనీల ప్రతినిధులు లెటర్స్ ఆఫ్ ఇంటెంట్‌పై సంతకాలు చేశారు.
వివరాలు
హైదరాబాద్ - కిటాక్యూషు మధ్య నేరుగా విమాన సౌకర్యం
హైదరాబాద్‌ను కిటాక్యూషు నగరంలా పరిశుభ్రమైన,సుస్థిర నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ ఒప్పందాలు చేసుకున్నారు.
గతంలో పారిశ్రామిక కాలుష్యం కారణంగా తీవ్రంగా ప్రభావితమైన కిటాక్యూషు,ప్రస్తుతం ప్రపంచంలోని అత్యంత పరిశుభ్రమైన నగరాలలో ఒకటిగా ఎలా మారిందో మేయర్ టేకుచి వివరించారు.
తమ అనుభవాలు,సాంకేతికతలు,పర్యావరణ పరిరక్షణకు తీసుకున్న చర్యలను తెలంగాణతో పంచుకోవడానికి వారు ఉత్సాహం చూపించారు.
ఈ సందర్భంగా హైదరాబాద్ - కిటాక్యూషు మధ్య నేరుగా విమాన సౌకర్యం కల్పించే అంశాన్ని కూడా చర్చించారు.
అదేవిధంగా, ముఖ్యమంత్రి హైదరాబాద్‌లో జపనీస్ భాషా పాఠశాల ఏర్పాటుకు తన ప్రతిపాదనను వెల్లడించారు.
జపాన్‌లో యువ శక్తికి పెద్దపీట వేయబడుతున్న నేపథ్యంలో, తెలంగాణ యువతకు జపనీస్ భాషలో నైపుణ్యం కల్పించితే, అంతర్జాతీయంగా ఉపాధి అవకాశాలు విస్తృతంగా లభిస్తాయని సీఎం రేవంత్ అభిప్రాయపడ్డారు.
వివరాలు
"సుస్థిరత ఇకపై ఐచ్ఛికం కాదు, అవసరం" - సీఎం రేవంత్ రెడ్డి
"పర్యావరణ పరిరక్షణతో పాటు, ఉపాధి అవకాశాలు, అభివృద్ధి, సంపద సృష్టిలో భాగస్వామ్యం కావాలనేది ప్రభుత్వ సంకల్పం" అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లో ఎకో టౌన్ అభివృద్ధి ద్వారా భవిష్యత్ తరాలకు శుభ్రమైన వాతావరణాన్ని అందించగలమన్న నమ్మకం తమకు ఉందని తెలిపారు.
తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధికి అనుకూలంగా మారింది: మంత్రి శ్రీధర్‌బాబు
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం పారిశ్రామిక అభివృద్ధికి అత్యంత అనుకూల వేదికగా ఎదుగుతోందని పేర్కొన్నారు.
ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి, పారదర్శక పాలన వల్ల జపాన్ సంస్థలు పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు.
వివరాలు
మురాసాకి నది పునరుజ్జీవన ప్రాజెక్టు పరిశీలన
ఈ పర్యటనలో భాగంగా తెలంగాణ ప్రతినిధి బృందం, గతంలో తీవ్ర కాలుష్యానికి గురైన మురాసాకి నదిని సందర్శించింది.
ప్రస్తుతం పూర్తిగా పరిశుభ్రంగా తీర్చిదిద్దిన ఈ నది తీరం,పర్యావరణ పరిరక్షణలో సాధ్యమైన మార్పుల పరిపాటి ఎలా ఉండాలో ప్రత్యక్షంగా చూసే అవకాశం బృందానికి లభించింది.
కిటాక్యూషు మేయర్‌తో సీఎం రేవంత్ భేటీ
కిటాక్యూషు మేయర్ టేకుచి, జపాన్ సంప్రదాయ పద్ధతిలో తెలంగాణ ప్రతినిధుల బృందానికి ఘనంగా స్వాగతం పలికారు.
ఒకప్పుడు తీవ్ర కాలుష్యానికి కేంద్రమైన కిటాక్యూషు నగరం, పర్యావరణ పరిరక్షణలో అంతర్జాతీయంగా మోడల్ నగరంగా ఎలా మారిందో ఆయన వివరించి, ఆ మార్గదర్శకత తెలంగాణకూ ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.