డెక్కన్ క్రానికల్ కు ఈడీ ఝలక్.. మనీలాండరింగ్ కేసుల్లో డీసీ ప్రమోటర్లు అరెస్ట్
ఈ వార్తాకథనం ఏంటి
డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ (డీసీహెచ్ఎల్) మాజీ ప్రమోటర్లకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ షాక్ ఇచ్చింది. ఈ మేరకు బుధవారం ఉదయం వెంకట్రామిరెడ్డి సహా మరో ఇద్దరిని అరెస్ట్ చేసింది.
కెనరా బ్యాంక్, ఐడీబీఐ బ్యాంకుల్లో రుణాలు తీసుకుని ఉద్దేశపూర్వకంగా ఎగవేసినందుకే అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
2005 నుంచి వెంకట్రామిరెడ్డి అప్పుల చేయడం ప్రారంభించారు. 2009-11 కాలంలో డీసీహెచ్‌ఎల్ వందల కోట్లు వివిధ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంది.
అయితే పెద్ద మొత్తంలో సేకరించిన రుణాలు దారి మళ్లించారనే అభియోగాలు మీద ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆరు కేసులను నమోదు చేసింది. డీసీ చీఫ్ ప్రమోటర్ గా వెంకట్రామిరెడ్డి తీసుకున్న రూ. 8,800 కోట్ల రుణాలు తిరిగి కట్టకుండా ఎగవేసిన నేపథ్యంలోనే ఈడీ దాడులు చేసింది.
DETAILS
మనిలాండరింగ్ కేసులో వెంకట్రామిరెడ్డి, పీకే అయ్యర్, మని ఓమెన్ అరెస్ట్
మంగళవారం డీసీ ప్రధాన ప్రమోటర్ వెంకట్రామిరెడ్డితో పాటు గతంలో సీఈఓగా పనిచేసిన పీకే అయ్యర్ ను ఈడీ అధికారులు విచారించారు.
అనంతరం మరో వ్యక్తి మని ఓమెన్ కూడా పిలిపించి పలు ప్రశ్నలు సంధించారు. ఈ మేరకు హవాలా, మనిలాండరింగ్ కు సంబంధించిన కేసులపై ముగ్గురిని అరెస్ట్ చేశారు.
అయితే బుధవారమే ఈ ముగ్గురిని ఈడీ కోర్టులో హాజరుపర్చనున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు తెలిపారు.
మరోవైపు హైదరాబాద్ తో పాటు గురుగ్రామ్, చెన్నై, దిల్లీ, బెంగళూరు తదితర ప్రాంతాల్లో ఉన్న దాదాపు 14 డెక్కన్ క్రానికల్ ఆస్తులను సైతం ఈడీ సీజ్ చేసింది. ఇప్పటివరకు ఈ కేసులో ఈడీ రూ. 264.56 కోట్లు ఆస్తులను జప్తు చేసింది.