
YS Jagan: జగన్ అక్రమాస్తుల కేసులో దాల్మియా సిమెంట్స్ ఆస్తులను అటాచ్ చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్
ఈ వార్తాకథనం ఏంటి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు,ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి సంబంధించిన అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
ఈ కేసులో దాల్మియా సిమెంట్స్ సంస్థకు చెందిన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాత్కాలికంగా జప్తు చేసినట్లు ప్రకటించింది.
ఈడీ ప్రకారం,ఈ ఆస్తుల మొత్తం విలువ దాదాపు రూ.793 కోట్లు ఉంటుందని పేర్కొంది.కడప జిల్లాలోని సుమారు 417 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న సున్నపురాయి (లైమ్‌స్టోన్) గనులను దాల్మియా సిమెంట్స్ సంస్థకు అప్పటి వైఎస్‌ఆర్ ప్రభుత్వ కాలంలో లీజుగా మంజూరు చేసినట్లు సమాచారం.
అయితే, ఈ లీజు వ్యవహారంలో అనేక అక్రమాలు జరిగాయని, ఇందులో జగన్ పాత్ర ఉందని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) గతంలోనే ఆరోపణలు చేసింది.
వివరాలు
రూ.793 కోట్ల విలువైన దాల్మియా సిమెంట్స్ ఆస్తుల అటాచ్
సీబీఐ 2013లో దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో, జగన్ సహకారంతో దాల్మియా సిమెంట్స్ సంస్థ ఈ గనుల లీజులను నిబంధనలకు విరుద్ధంగా పొందినట్లు వివరించింది.
అలాగే, ఈ లీజుల ద్వారా జగన్ దాదాపు రూ.150 కోట్ల మేర అక్రమంగా లాభాలు పొందినట్లు సీబీఐ పేర్కొంది.
ఇంతేకాక, రఘురామ్ సిమెంట్స్ అనే కంపెనీలో దాల్మియా సిమెంట్స్ సంస్థ రూ.95 కోట్ల విలువైన షేర్లను పెట్టుబడిగా పెట్టినట్లు,రూ.55 కోట్లు హవాలా మార్గంలో ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని, సీబీఐ ఛార్జ్‌షీట్ ఆధారంగా మనీలాండరింగ్ కోణంలో ఈడీ ప్రత్యేకంగా దర్యాప్తు ప్రారంభించింది.
ఈ నేపథ్యంలోనే, తాజాగా ఈడీ రూ.793 కోట్ల విలువైన దాల్మియా సిమెంట్స్ ఆస్తులను అటాచ్ చేయడం జరగింది.