Telangana : ఈఎస్ఐ స్కామ్ కేసులో ఛార్జిషీట్ దాఖలు చేసిన ఈడీ
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ- బీమా వైద్య సేవల(IMS) కుంభకోణంలో ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది.
నాంపల్లిలోని ప్రత్యేక ఈడీ కోర్టులో ఛార్జ్ షీట్ నమోదు చేసింది.ఈ మేరకు ప్రధాన నిందితురాలిగా ఐఎంఎస్ మాజీ డైరెక్టర్ దేవికారాణి సహా 15 మందిని నిందితులుగా పేర్కొంది.
ఇప్పటికే వీరికి సంబంధించిన రూ.144 కోట్ల భారీ ఆస్తులను ఈడీ జప్తు చేసింది.ఏసీబీ కేసు ఆధారంగా ఈడీ మరో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తోంది.
వైద్యం చేయకుండానే చేసినట్లుగా,మందులు కొనకుండానే కొన్నట్లుగా చూపించారు.దీంతోపాటు తక్కువ ధరకే ఔషధాలను కొనుగోలు చేసి లెక్కల్లో మాత్రం ఎక్కువగా చూపించారు.
ఈ నేపథ్యంలోనే పలువురు ఐఎంఎస్ అధికారులు భారీ కుంభకోణం చేసినట్లు 2019లోనే ఏసీబీ కేసు నమోదు చేసింది.
DETAILS
వివిధ ప్రాంతాల్లో భారీగా కూడబెట్టిన ఆస్తులను కోర్టుకు చూపించిన ఈడీ
మెడికల్ క్యాంపుల నిర్వహణ, మందులు, సర్జికల్ కిట్ల కొనుగోలులో బీమా వైద్య సేవల(IMS) డైరెక్టర్ గా పనిచేసిన దేవికారాణిపై ఈడీ కొరడా ఝలిపించింది.
ఈ మేరకు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం కేసులు రిజిస్టర్ చేశారు.
దేవికారాణి, ఓమ్ని మెడి కంపెనీ ఎండీ శ్రీహరిబాబు సహా మొత్తం 15 మంది కేసులో ఉన్నట్లు ఈడీ గుర్తించింది. నకిలీ బిల్లులు సృష్టించి రూ.230 కోట్లను సొంత ఖాతాల్లోకి మళ్లించినట్లు ధ్రువీకరించింది.
కొల్లగొట్టిన డబ్బుతో హైదరాబాద్, బెంగళూరు, నోయిడా, ఏపీలో నిందితులు భారీగా ఆస్తులు కొన్నట్లు తేలింది.
97 ప్లాట్లు, 18 వాణిజ్య భవనాలు, 4 ఫ్లాట్లు, 6 విల్లాలు, 6 వ్యవసాయ భూములు ఉన్నాయని, వాటి విలువ రూ.144 కోట్లుగా పేర్కొంది.