హైదరాబాద్‌లో ఈడీ సోదాల కలకలం; ఆ కంపెనీలే టార్గెట్‌గా దాడులు
హైదరాబాద్‌లోని వివిధ ఫార్మా కంపెనీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్( ఈడీ) శనివారం ఉదయం నుంచి దాడులు ప్రారంభించింది. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న పలు ప్రముఖ ఫార్మా, రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఏకకాలంలో ఈ సోదాలు జరుగుతున్నాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, పటాన్‌చెరు సహా 15 చోట్ల ఉన్న కంపెనీల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఎనిమిది చోట్ల సాహిత్య ఇన్‌ఫ్రా సంబంధిత సంస్థల్లో కూడా ఉదయం నుంచి ఈడీ సోదాలు జరుగుతున్నాయి. ప్రీ లాంచ్ పేరుతో సాహితీ ఇన్ ఫ్రా రియల్ ఎస్టేట్ మోసానికి పాల్పడుతోందనే ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఫీనిక్స్ కార్యాలయాల్లో కూడా సోదాలు
ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఫీనిక్స్‌లో కూడా ఈడీ సోదాలు కొనసాగుతున్నట్లు సమాచారం. పన్ను ఎగవేత అనుమానంతో ఐటీ డిపార్ట్‌మెంట్ గత ఆగస్టులో ఫీనిక్స్ కార్యాలయాల్లో తనిఖీలు చేసింది. ఫీనిక్స్ గ్రూప్ చైర్మన్ చుక్కపల్లి సురేష్‌తో పాటు మేనేజింగ్ డైరెక్టర్ గోపీకృష్ణ, శ్రీకాంత్, భువనేశ్ ఇళ్లలో కూడా ఐటీ శాఖ ఆగస్టులో సోదాలు చేసింది. కూకట్‌పల్లిలో భూముల విక్రయానికి సంబంధించి ఫీనిక్స్ గ్రూపునకు, రెండు కంపెనీలకు మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించి గతంలో దాడులు జరిగాయి. ఈ వారం ప్రారంభంలో నకిలీ మందులను తయారు చేసిన 18 ఫార్మా కంపెనీల లైసెన్స్‌లను కేంద్రం రద్దు చేసింది. డ్రగ్ రెగ్యులేటర్ డీసీజీఐ ఈ చర్య తీసుకునే ముందు 20రాష్ట్రాల్లోని 76కంపెనీలను తనిఖీ చేసింది.