Page Loader
తెలంగాణలో ఈడీ రైడ్స్.. ప్రతిమ, కామినేని సహా పలు వైద్య కళాశాలల్లో సోదాలు
తెలంగాణలో ఈడీ రైడ్స్.. ప్రతిమ, కామినేని సహా పలు వైద్య కళాశాలల్లో సోదాలు

తెలంగాణలో ఈడీ రైడ్స్.. ప్రతిమ, కామినేని సహా పలు వైద్య కళాశాలల్లో సోదాలు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jun 21, 2023
03:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో మరోసారి ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ రైడ్స్ కలకలం సృష్టిస్తున్నాయి. హైదరాబాద్ నగరంతో పాటు పలు జిల్లాల్లోనూ ఈడీ అధికారులు ఉదయం నుంచి సోదాలు చేస్తున్నారు. ఉదయం బషీర్‌బాగ్‌లోని ఈడీ ఆఫీసు నుంచి బృందాలుగా వివిధ ప్రాంతాలకు బయల్దేరారు. ఈ మేరకు అధికారుల వెంట కేంద్ర బలగాలు (సీఆర్పీఎఫ్) భారీగా కదిలాయి. నల్గొండ, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలలోని పలు ప్రాంతాల్లో ఈడీ తనిఖీలు చేపట్టినట్టు సమాచారం. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఎస్వీఎస్ మెడికల్ కాలేజీ అండ్ రీసెర్చ్ సెంటర్లలో సోదాలు జరిగాయి. అలాగే హైదరాబాద్‌లోని ఎస్వీఎస్ బ్రాంచ్‌ల్లోనూ ఈడీ ప్రవేశించింది. సుమారు 6 జిల్లాలోని వైద్యకళాశాలపై ఈడీ తనిఖీలు కొనసాగుతున్నాయి.

DETAILS

కామినేని వైద్య కళాశాలతో పాటు మరికొన్నింటిపై ఈడీ రైడ్స్ 

ఆయా కళాశాలల్లో ఫీజు వసూలు, ఆర్థిక వ్యవహారాలు, లావాదేవీల నేపథ్యంలోనే ఈడీ ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలోనే బీఆర్ఎస్ నాయకులకు చెందిన నివాసాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు చేశారు. తాజాగా ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ రాష్ట్ర వ్యాప్తంగా పలు కళాశాల యాజమాన్యం గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. ఇందులో భాగంగానే మెడికల్ కలేజీలు, వాటి యాజమాన్యాలపై ఫోకస్ పెట్టిందని సమాచారం. ఈ క్రమంలోనే కరీంనగర్ జిల్లాలోని కీలక రాజకీయ నేత కుటుంబానికి చెందిన ప్రతిమ మెడికల్ కాలేజీలో తనిఖీలు చేస్తున్నారు. మరోపక్క యాజమాన్యం ఆఫీస్, ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నాయని సమాచారం. ఎల్బీనగర్‌లోని కామినేని వైద్య కళాశాలతో పాటు జిల్లా పరిసరాల్లోని ఇతర కాలేజీల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి.