Cyclone Fengal: ఫెంగల్ తుఫాను ప్రభావం.. తమిళనాడులో రవాణా సేవలు, విమాన రాకపోకలపై అంతరాయం
నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం శుక్రవారం తుఫానుగా మారింది. ఈ తుఫాను శనివారం సాయంత్రానికి పుదుచ్చేరి సమీపంలోని కరైకల్ - మహాబలిపురం మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 70-80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఫెంగల్ తుపాను ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై, చెంగల్‌పేట్, కాంచీపురం, తిరువళ్లూరు, మైలాడుతురై, నాగపట్నం, తిరువావూర్ వంటి ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా ముఖ్యమైన రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరడంతో జనజీవనం స్తంభించపోయింది. తుఫాను కారణంగా చెన్నై విమానాశ్రయంలోని విమాన కార్యకలాపాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.
ఇండిగో విమానయాన సేవలకు అంతరాయం
ఇండిగో విమానయాన సంస్థ తమ విమానాలను తాత్కాలికంగా నిలిపివేసింది. ప్రయాణికుల భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని ఆ సంస్థ ప్రకటించింది. వాతావరణ పరిస్థితులు మెరుగుపడిన తర్వాత విమాన సేవలను తిరిగి ప్రారంభించనున్నట్లు పేర్కొంది. తుఫాను ప్రభావంతో తమిళనాడు ప్రభుత్వం కొన్ని జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్‌పట్టు జిల్లాల్లో ఈ ఆదేశం అమలు కానుంది. తీర ప్రాంతానికి సమీపంగా ఉన్న ఈస్ట్ కోస్ట్ రోడ్, పాత మహాబలిపురం రోడ్ వంటి మార్గాల్లో ప్రయాణాన్ని నిషేధించారు.