
Uttar Pradesh: ఉత్తర్‌ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది దుర్మరణం
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం తెల్లవారుజామున ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యాత్రికులతో నిండిన ట్రాక్టర్-ట్రాలీని వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన కంటైనర్ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒక చిన్నారి,ఇద్దరు మహిళలతో సహా మొత్తం ఎనిమిది మంది దుర్మరణం చెందగా, మరో 43 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల ప్రకారం.. కాస్‌గంజ్ జిల్లా రాఫత్‌పూర్ గ్రామానికి చెందిన సుమారు 61 మంది యాత్రికులు రాజస్థాన్‌లోని ప్రసిద్ధ జహర్‌పీర్ (గోగాజీ) పుణ్యక్షేత్ర దర్శనార్థం ట్రాక్టర్ ట్రాలీలో బయలుదేరారు. సోమవారం అర్ధరాత్రి 2.15 గంటల సమయంలో, బులంద్‌శహర్-అలీగఢ్ సరిహద్దులోని జాతీయ రహదారి 34పై వాహనం వెళ్తుండగా ప్రమాదం సంభవించింది. వేగంగా వచ్చిన కంటైనర్ ట్రక్కు ట్రాక్టర్‌ను ఢీకొట్టడంతో ట్రాలీ అదుపుతప్పి తలకిందులైంది.
వివరాలు
ఘటనకు కారణమైన కంటైనర్ ట్రక్కును స్వాధీనం చేసుకున్న పోలీసులు
ఈ విషాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే జిల్లా కలెక్టర్, ఎస్ఎస్పీతో పాటు స్థానిక పోలీసు, పరిపాలనా అధికారులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని తక్షణమే సమీపంలోని ఆసుపత్రులకు తరలించారని రూరల్ ఎస్ఎస్పీ దినేశ్‌కుమార్ సింగ్ తెలిపారు. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో వారికి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్టు ఆయన వివరించారు. ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన ట్రాక్టర్‌ను క్రేన్ సహాయంతో రహదారి నుండి తొలగించారు. ఘటనకు కారణమైన కంటైనర్ ట్రక్కును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.