Page Loader
Eknath Shinde: మహారాష్ట్ర కీలక సమావేశాన్ని రద్దు చేసుకొని.. సొంతూరుకు  ఏక్‌నాథ్ షిండే
మహారాష్ట్ర కీలక సమావేశాన్ని రద్దు చేసుకొని.. సొంతూరుకు ఏక్‌నాథ్ షిండే

Eknath Shinde: మహారాష్ట్ర కీలక సమావేశాన్ని రద్దు చేసుకొని.. సొంతూరుకు  ఏక్‌నాథ్ షిండే

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 29, 2024
02:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

అసెంబ్లీ ఎన్నికలు ముగిసినప్పటికీ మహారాష్ట్ర (Maharashtra) రాజకీయ పరిణామాలు ఉత్కంఠగా మారాయి. ముఖ్యమంత్రి పదవి విషయంలో చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. అయితే, ఈ రోజు ముంబయిలో జరగాల్సిన కీలక సమావేశం రద్దు అయ్యిందని జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఆధ్వర్యంలో నిన్న మహాయుతి నేతలు ఏక్‌నాథ్‌ షిండే, దేవేంద్ర ఫడణవీస్‌, అజిత్‌ పవార్‌లు సమావేశమయ్యారు.

వివరాలు 

షిండే ప్రస్తుతం తన స్వగ్రామంలో ఉన్నారు

"మహారాష్ట్ర సీఎం పదవి (Maharashtra CM Post)పై ఒకటి లేదా రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటాం. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో సానుకూల చర్చలు జరిగాయి. ముంబయిలో మరోసారి చర్చలు జరిపి నిర్ణయం ప్రకటిస్తాం" అని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి శిందే (Eknath Shinde) తెలిపారు. అయితే, ముంబయిలో జరగాల్సిన ఈ కూటమి సమావేశం ఇప్పుడు రద్దయిందని సమాచారం. అలాగే, శివసేన పార్టీ సమావేశం కూడా రద్దయిందని తెలుస్తోంది. షిండే ప్రస్తుతం తన స్వగ్రామం సతారాలో ఉన్నారని, అక్కడినుంచి తిరిగి వచ్చిన తర్వాత సమావేశాలు నిర్వహించవచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

వివరాలు 

సీఎంగా చేసిన వ్యక్తిని మళ్లీ ఉప ముఖ్యమంత్రిగా చేయడం సమంజసం కాదు:  సంజయ్‌ సిర్సాత్‌ 

మరోవైపు, ముఖ్యమంత్రి రేసులో ఫడణవీస్‌ ముందు ఉన్నా, మరో ప్రత్యామ్నాయంపై బీజేపీ అధిష్ఠానం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. మహారాష్ట్రలో సామాజిక సమీకరణాలపై బీజేపీ అధిష్ఠానం విశ్లేషణ చేస్తోందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా, ఉప ముఖ్యమంత్రి పదవిని ఏక్‌నాథ్‌ శిందే తిరస్కరించారని ఆయన సమీప వర్గాలు వెల్లడించాయి. "సీఎంగా చేసిన వ్యక్తిని మళ్లీ ఉప ముఖ్యమంత్రిగా చేయడం సమంజసం కాదని" శివసేన ఎమ్మెల్యే సంజయ్‌ సిర్సాత్‌ వ్యాఖ్యానించారు.