సీఎం సిద్ధరామయ్య కాలనీ వాసులకు పార్కింగ్ సమస్యలు.. కాన్వాయికి అడ్డం తిరిగిన సామాన్యుడు
కర్ణాటకలో సీఎం సిద్ధరామయ్యకు చేదు అనుభవం ఎదురైంది. ఈ మేరకు బెంగళూరులోని కుమారకృపా రోడ్డులో సీఎం నివాసానికి ఎదురుగా నరోత్తమ్ అనే వృద్ధుడు నివసిస్తున్నారు. శుక్రవారం ఉదయం సీఎం వస్తున్నట్లు గమనించిన నరోత్తమ్ కాన్వాయ్‌కు ఎదురెళ్లాడు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆయన్ను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. తాను సీఎంతో మాట్లాడాలని, అనుమతించాలని కోరారు. దీంతో కాన్వాయి ఆగగా సిద్ధరామయ్య ఉన్న కారు వద్దకు వెళ్లి మీ కోసం వచ్చే వీఐపీ, వీవీఐపీ వాహనాలు ఇష్టం వచ్చినట్లు పార్క్ చేస్తున్నారు. ఈ క్రమంలో నేను, నా కుటుంబీకులు మా కార్లను బయటికి తీయలేకపోతున్నట్లు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. గత 5 ఏళ్లుగా కాలనీలో పార్కింగ్ సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు మొరపెట్టుకున్నారు. ఇకపై సమస్యను భరించలేమన్నారు.
కాలనీలో ట్రాఫిక్ సమస్యలు, వీఐపీల కారు పార్కింగ్ సమస్యలు
నరోత్తమ్ ఫిర్యాదుకు స్పందించిన సీఎం సిద్ధరామయ్య పార్కింగ్‌కు అసౌకర్యం లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశాలిచ్చారు. మరోవైపు కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక, సిద్ధరామయ్య అధికారిక నివాసానికి మారలేదు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు నివసించిన ఇంటినే ప్రస్తుతం సీఎం అయ్యాక కూడా కొనసాగిస్తున్నారు. దీంతో ఆ కాలనీలో ట్రాఫిక్ సమస్యలు, వీఐపీల కారు పార్కింగ్ సమస్యలు ఎక్కువయ్యాని నరోత్తమ్ ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప ముఖ్యమంత్రి అధికారిక క్వార్టర్ ను ఇంకా ఖాళీ చేయలేదు.ఈ క్రమంలోనే పార్కింగ్ దుస్థితి అధికమైనట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారిక బంగ్లాను ఆయన ఖాళీ చేయనున్నారని, ఆగస్టులో సిద్ధరామయ్య అధికారిక నివాసంలోకి మారే అవకాశం ఉందని సీఎంఓ అధికారులు చెబుతున్నారు.