Page Loader
Election Commission: తెలంగాణలో గుర్తింపు లేని 13 రాజకీయ పార్టీలకు షాక్ ఇచ్చిన ఈసీ..
తెలంగాణలో గుర్తింపు లేని 13 రాజకీయ పార్టీలకు షాక్ ఇచ్చిన ఈసీ..

Election Commission: తెలంగాణలో గుర్తింపు లేని 13 రాజకీయ పార్టీలకు షాక్ ఇచ్చిన ఈసీ..

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 04, 2025
05:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ రాష్ట్రంలో నమోదైన గుర్తింపు లేని 13 రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) నిబంధనల మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సీ.సుధర్శన్ రెడ్డి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ప్రజాప్రతినిధుల చట్టం-1951 లోని సెక్షన్ 29ఏ ప్రకారం,ఈ పార్టీలు గత ఆరు సంవత్సరాల్లో ఏ సాధారణ ఎన్నికలైనా,శాసనసభ ఎన్నికలైనా,లేదా ఉప ఎన్నికలైనా పాల్గొనకుండా అభ్యర్థులను నిలబెట్టలేదు. చట్టం ప్రకారం రాజకీయ పార్టీగా గుర్తింపు పొందిన తర్వాత, ఎన్నికల్లో చురుకుగా పాల్గొనాల్సిన బాధ్యతను ఈ పార్టీలు నిర్వర్తించకపోవడంతో, వీటిని నిబంధనలకు అనుగుణంగా రాజకీయ పార్టీలుగా పరిగణించలేమని అధికారులు తేల్చారు. ఈ నేపథ్యంలో, ఈ 13 పార్టీలను రాజకీయ పార్టీల జాబితా నుండి తొలగించే ప్రతిపాదనను ఈసీఐ పరిశీలిస్తోంది.

వివరాలు 

వివరణ ఇవ్వడానికి జూలై 11వ చివరి తేదీ

అయితే, ఈ నిర్ణయానికి ముందు సంబంధిత పార్టీలకు తమ వివరణ ఇవ్వడానికి అవకాశం ఇవ్వాలని తెలంగాణ ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు జారీ చేసిన షోకాజ్ నోటీసులకు సంబంధించి, రాతపూర్వకంగా వివరణలను 2025 జూలై 11వ తేదీలోపు సమర్పించాలని ఆదేశించింది. అంతేకాక, సంబంధిత పార్టీ అధ్యక్షుడు లేదా ప్రధాన కార్యదర్శి అఫిడవిట్ రూపంలో వివరణతో పాటు అవసరమైన ఆధారాలను సమర్పించాలని పేర్కొంది. ఇదే సమయంలో, జూలై 15, 2025న జరగనున్న విచారణకు తప్పనిసరిగా హాజరుకావాలని సూచించింది.

వివరాలు 

పార్టీ తరఫున ఓ అధికార ప్రతినిధి హాజరుకావాలి 

విచారణకు పార్టీ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి లేదా పార్టీ తరఫున ఓ అధికార ప్రతినిధి హాజరుకావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. నోటీసులకు ప్రతిస్పందించకపోతే లేదా విచారణకు హాజరుకాకపోతే, భారత ఎన్నికల సంఘం విధించిన మార్గదర్శకాలను అనుసరించి తదుపరి చర్యలు తప్పకుండా తీసుకుంటామని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుధర్శన్ రెడ్డి హెచ్చరించారు.

వివరాలు 

షోకాజ్ నోటీసులు అందిన 13 గుర్తింపు లేని రాజకీయ పార్టీలు ఇవే.. 

1. తెలంగాణ కార్మిక రైతు రాజ్యం పార్టీ 2. ఇండియన్ మైనారిటీస్ పొలిటికల్ పార్టీ 3. జాగో పార్టీ 4. నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ 5. తెలంగాణ లోక్‌సత్తా పార్టీ 6. తెలంగాణ మైనారిటీస్ ఓబీసీ రాజ్యం 7. యువ పార్టీ 8. బహుజన్ సమాజ్ పార్టీ (అంబేద్కర్-ఫూలే) 9. తెలంగాణ స్టూడెంట్స్ యునైటెడ్ ఫర్ నేషన్ పార్టీ 10. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమైక్య సమితి పార్టీ 11. జాతీయ మహిళా పార్టీ 12. యువ తెలంగాణ పార్టీ 13. తెలంగాణ ప్రజా సమితి (కిశోర్, రావు మరియు కిషన్)