
తెలంగాణ సహా 5 రాష్ట్రాల్లో ఎన్నికల నగారా.. మార్గదర్శకాలు విడుదల చేసిన సీఈసీ
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ సహా 5 రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికల ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం ( సీఈసీ ) ప్రారంభించింది. ఈ మేరకు తెలంగాణ, మిజోరం, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల అసెంబ్లీల గడువు వచ్చే ఏడాది జనవరి నాటికి ముగియనున్నట్లు వెల్లడించింది.
ఫలితంగా 2023 చివరి నాటికే ఈ 5 రాష్ట్రాలలో ఎన్నికల నగారా మోగనుంది. ఈ సందర్భంగా ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ప్రభుత్వ యంత్రాంగం బదిలీలు, పోస్టింగులకు సంబంధించి సీఈసీ శుక్రవారం సర్క్యూలర్ విడుదల చేసింది.
ఎన్నికల విధుల్లో ప్రత్యక్షంగా భాగమయ్యే ఆఫీసర్లెవరూ తమ సొంత జిల్లాల్లో పనిచేయకుండా చూడాలని ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ( సీఎస్ ), ఎన్నికల ప్రధానాధికారులకు (సీఈఓ)లకు ఆదేశాలు జారీ చేసింది.
Elections In 5 States
మూడేళ్లు ఒకే దగ్గర పనిచేస్తే బదిలీ చేయాల్సిందే : సీఈసీ
గడిచిన నాలుగేళ్లలో ఏకదాటిగా 3 ఏళ్లు ఒకే జిల్లాలో పనిచేస్తున్న వారిని, అలాగే 2024 జనవరి 31 నాటికి మూడేళ్ల కాల వ్యవధిని పూర్తి చేసుకోబోతున్న వారిని సైతం బదిలీ చేయాలని సూచించింది.
జూలై 31లోపు ఈ బదిలీలను పూర్తి చేసి, దీనిపై నివేదికను సైతం సమర్పించాలని కోరింది. బదిలీ ప్రక్రియల్లో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే అందుకు గల కారణాన్ని సీఈవో ద్వారా తెలియజేయాలని సూచించింది.
ఎలక్షన్ డ్యూటీల్లో భాగమయ్యే ఆఫీసర్లు ముందుగానే తమకు అభ్యర్థులు, సహా రాజకీయ నేతలతో ఎలాంటి దగ్గరి బంధుత్వం లేదని, నామినేషన్ల పర్వం ముగిసే చివరి రెండు రోజుల ముందులోగా డిక్లరేషన్ ను ఇవ్వాలని ఆదేశించింది.
cec
ఎన్నికలు జరిగే 5 రాష్ట్రాల అసెంబ్లీల గడువు వివరాలు
మిజోరం - 17-12-2023
ఛత్తీస్‌గఢ్ - 03-01-2024
మధ్యప్రదేశ్ - 06-01-2024
రాజస్థాన్ - 14-01-2024
తెలంగాణ - 16-01-2024
పోలీస్ శాఖలోని ఎస్‌ఐలను ఎట్టిపరిస్థితుల్లో సొంత జిల్లాలో నియమించకూడదని స్పష్టం చేసింది సీఈసీ. ఇటీవల పదోన్నతి పొంది..అదే ప్రాంతంలో పనిచేస్తున్నా స్థాన చలనం కల్పించాలని పేర్కొంది.
అలాగే తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు న్యాయస్థానంలో పెండింగ్‌లో లేవని, ఆయా అధికారులు నామినేషన్ల దాఖలు గడువుకు రెండు రోజుల ముందే నిర్ధారిత నమూనాలో డిక్లరేషన్ ఇవ్వాలని స్పష్టం చేసింది.
మరోవైపు తెలంగాణలో కొత్త ఓటర్ల నమోదుకు ప్రక్రియ షురువైంది. ఇందులో భాగంగా 2023 అక్టోబర్ 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు కొత్తగా ఓటరు నమోదు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.