Loksabha poll-Cash cease: ఎన్నికల కోడ్...భారీగా పట్టుబడుతున్న నగదు, మద్యం, డ్రగ్స్
లోక్‌సభ (Loksabha) ఎన్నికల (Elections) నేపథ్యంలో దేశంలో ప్రతీరోజు కనీసం సగటున 100 కోట్లను అధికారులు సీజ్ చేస్తున్నారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు డబ్బు, మద్యాన్ని విచ్చలవిడిగా తరలించేందుకు రాజకీయ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఎన్నికల్లో డబ్బు (Cash) ను ప్రభావాన్ని అరికట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న కట్టుదిట్ట మైన చర్యల ఫలితంగా రాజకీయ నేతలుగానీ, పార్టీలు గానీ లక్ష్యానికి చేరవేయలేకపోతున్నారు. ప్రతీరోజూ దేశంలో ఎక్కడో ఒకచోట లేదా దేశవ్యాప్తంగా సగటున వంద కోట్ల రూపాయలను అధికారులు పట్టుకుని స్వాధీనం చేసుకుంటున్నారు. మార్చి 1 నుంచి ఇప్పటివరకూ అధికారులు స్వాధీనం చేసుకున్న నగదు విలువ 4,658 కోట్లుగా ఉందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
మద్యం, డ్రగ్స్ కూడా...
2019 ఎన్నికలతో పోలిస్తే ఈ మొత్తం చాలా ఎక్కువని తెలిపింది. పార్లమెంట్ ఎన్నికల చరిత్రలోనే ఇంత భారీగా నగదును ఎప్పుడూ సీజ్ చేయలేదని వెల్లడించింది. ఎన్నికల్లో ధన ప్రవాహం, మద్యం, డ్రగ్స్, ప్రలోభాలకు గురికాకుండా సజావుగా ఎన్నికలు నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు వివరించింది. తనిఖీలను ముమ్మరం చేయడంతో పాటు పోలీస్ చెక్ పోస్టులను కూడా ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న 4,658 కోట్ల విలువలో 395 కోట్ల రూపాయలు నగదు, 489 కోట్ల రూపాయల మద్యం ఉన్నట్లు వెల్లడించింది. మాదక ద్రవ్యాల విలువ 2065 కోట్ల ఉందని వివరించింది. దేశవ్యాప్తంగా భారీ ఎత్తున డ్రగ్స్ కూడా పట్టుబడుతుండటం పట్ల కేంద్ర ఎన్నికల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది.