10 రాజ్యసభ స్థానాలకు జూలై 24న ఎన్నికలు
గోవా, గుజరాత్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని 10 రాజ్యసభ స్థానాలకు జూలై 24న జరగనున్న ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మూడు రాష్ట్రాల్లో 10మంది సభ్యులు జూలై, ఆగస్టు నెలల్లో పదవీ విరమణ చేయనున్నట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. ఖాళీ కానున్న స్థానాల్లో పశ్చిమ బెంగాల్‌కు చెందిన డెరెక్ ఓబ్రెయిన్, గుజరాత్‌కు చెందిన విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ ఉన్నారు. ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసేందుకు జూలై 13 చివరి తేదీ అని ఈసీ తెలిపింది.
పోలింగ్ రోజు సాయంత్రమే ఓట్ల లెక్కింపు
జూలై 24న పోలింగ్ జరిగిన తర్వాత అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు జరగనుంది. అనంతరం ఫలితాలను వెల్లడించనున్నారు. వినయ్ డి.టెండూల్కర్ జూలై 28న పదవీ విరమణ చేయనున్నందున గోవా నుంచి ఒక రాజ్యసభ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. గుజరాత్‌లోని మూడు రాజ్యసభ స్థానాలకు దినేష్‌చంద్ర జెమల్‌భాయ్ అనవాదియా, లోఖండ్‌వాలా జుగల్‌సింగ్ మాథుర్జీ, సుబ్రహ్మణ్యం జైశంకర్ కృష్ణస్వామి ఆగస్టు 18న పదవీ విరమణ చేయనున్నారు. డెరెక్ ఓబ్రెయిన్, డోలా సేన్, ప్రదీప్ భట్టాచార్య, సుస్మితా దేవ్, శాంతా ఛెత్రి, సుఖేందు శేఖర్ రే ఆగస్టు 18న పదవీ విరమణ చేయనుండగా పశ్చిమ బెంగాల్‌లోని ఆరు రాజ్యసభ స్థానాలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి.