
తమిళనాడులో రాజకీయ కలకలం.. కోరిక తీర్చాలని పన్నీరు సెల్వం కుమారుడి వేధింపులు
ఈ వార్తాకథనం ఏంటి
తమిళనాడులో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం కుమారుడు చిక్కుల్లో పడ్డారు. ఎంపీ రవీంద్రనాథ్ పై ఓ మహిళ సంచలన లైంగిక ఆరోపణలు చేశారు.
తనను అన్నగా భావించానని, కానీ తనపైనే ఆశపడటం పట్ల బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. సహకరించకపోతే చంపేస్తానని రవీంద్రనాథ్ బెదిరించినట్లు గాయత్రిదేవి వెల్లడించారు. అటు డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశానన్నారు.
2014లో ఓ పెళ్లిలో పన్నీరు సెల్వం కుటుంబంతో తమకు పరిచయమైందని గాయత్రి పేర్కొన్నారు.
ఈ క్రమంలో ఇరు కుటుంబాల మధ్య అనుబంధం ఏర్పడినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ఒకే కుటుంబంగా మెలిగే వాళ్లమని ఆమె వివరించింది.
రవీంద్రనాథ్‌ను సోదరుడిగా భావించి సన్నిహితంగా మెలిగానని, 2022 చివరి నుంచి రవీంద్రనాథ్ వేధింపులు మొదలయ్యాయన్నారు.
DETAILS
రవీంద్రనాథ్ కుటుంబీకులకు చెప్పినా పట్టించుకోలేదు: గాయత్రీ దేవి
ఈ మధ్య రవీంద్రనాథ్ స్నేహితుడు ఒకరు తనకు ఫోన్ చేసి నువ్వంటే ఆయనకి ఎంతో ఇష్టం, సహకరిస్తే రాణిలా ఉంటావని, లేకుంటే చంపేస్తామని బెదిరించినట్లు చెప్పుకొచ్చింది.
మొదట్లో వీటిని పెద్దగా పట్టించుకోలేదని, ఒక రోజు రవీంద్రనాథ్ మద్యం మత్తులో తనకు ఫోన్ చేశాడని చెప్పింది. ఆ సందర్భంగా అసభ్యకరంగా దూషించాడని, ఆ మాటలు తీవ్రంగా బాధించినట్లు గాయత్రి దేవి గోడు వెల్లబోసుకుంది.
ఇటీవలే వేధింపులు మరింత తీవ్రమయ్యాయని, తనకు ప్రశాంతంగా నిద్ర లేకుండా చేశారని ఆవేదనకు లోనైంది. రవీంద్ర కుటుంబీకులకు జరిగింది చెప్పినా పట్టించుకోలేదని తెలిపింది.
రవీంద్ర బ్లాక్ మెయిల్ కారణంగా భయాందోళనలకు గురయ్యాయని, అందుకే పోలీసుల సహాయం కోసం వచ్చానని స్పష్టం చేశారు.