Page Loader
Nimisha Priya: నిమిష ప్రియ కేసు.. యెమెన్‌కు వెళ్లేందుకు అనుమతి ఇవ్వండి.. సుప్రీంను అడిగిన న్యాయవాదుల బృందం
యెమెన్‌కు వెళ్లేందుకు అనుమతి ఇవ్వండి.. సుప్రీంను అడిగిన న్యాయవాదుల బృందం

Nimisha Priya: నిమిష ప్రియ కేసు.. యెమెన్‌కు వెళ్లేందుకు అనుమతి ఇవ్వండి.. సుప్రీంను అడిగిన న్యాయవాదుల బృందం

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 18, 2025
01:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

యెమెన్‌లో మరణశిక్షకు గురవుతున్న కేరళ నర్సు నిమిషా ప్రియా (Nimisha Priya) కేసు ఇంకా ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. బాధిత కుటుంబంతో మాట్లాడేందుకు యెమెన్‌కు వెళ్లే అనుమతిని ఇవ్వాలని నిమిష తరఫున ఉన్న బృందం సుప్రీంకోర్టును కోరింది. అయితే, దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. అనుమతి విషయమై కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని సూచించింది. ఈ కేసును సుప్రీం మళ్లీ పరిశీలించింది. విచారణ సందర్భంగా యెమెన్ ప్రభుత్వం తాత్కాలికంగా నిమిష ప్రియ మరణశిక్షను నిలిపివేసిందని కేంద్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఆమెను క్షేమంగా భారత్‌కు తీసుకురావాలని కేంద్రం అన్ని ప్రయత్నాలు చేస్తోందని అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి ధర్మాసనానికి వెల్లడించారు.

వివరాలు 

అది కేంద్రాన్నే అడగండి: సుప్రీంకోర్టు

ఈ అంశంలో కేంద్రం తగిన చర్యలు తీసుకుంటోందని చెప్పిన ధర్మాసనం ఆ సమాధానంపై సంతృప్తి వ్యక్తం చేసింది. నిమిష ప్రియ రక్షణ కోసం ప్రభుత్వం అవసరమైన యత్నాలు చేస్తోందని పేర్కొంది. ఈ సందర్భంగా నిమిష తరఫున ఉన్న న్యాయవాదుల బృందం కోర్టులో ప్రత్యేక అభ్యర్థన చేసింది. బాధిత కుటుంబంతో సంప్రదింపులు జరిపేందుకు తమ బృందానికి యెమెన్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది. దీనిపై స్పందించిన ధర్మాసనం.. యెమెన్‌పై ప్రస్తుతం ప్రయాణ నిషేధం కొనసాగుతోందని గుర్తు చేస్తూ, ఈ విషయంపై కేంద్రమే నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. కేంద్రానికి అభ్యర్థన చేసుకునేందుకు పిటిషనర్లకు అవకాశం ఇచ్చింది. అనంతరం తదుపరి విచారణను ఆగస్టు 14వ తేదీకి వాయిదా వేసింది.

వివరాలు 

బ్లడ్ మనీ చర్చలు జరిపేందుకు మరింత సమయం

యెమెన్ వ్యక్తి హత్య కేసులో నిమిష ప్రియకు జూలై 16న మరణశిక్ష అమలు కావాల్సి ఉండగా.. చివరి క్షణంలో అక్కడి ప్రభుత్వం శిక్ష అమలును వాయిదా వేసింది. బాధిత కుటుంబంతో బ్లడ్ మనీ చర్చలు జరిపేందుకు మరింత సమయం ఇవ్వాలని భారత ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని యెమెన్ ప్రభుత్వం అంగీకరించింది. అయితే బ్లడ్ మనీ కోసం తమ కుటుంబం ఒప్పుకోబోదని బాధిత కుటుంబం స్పష్టం చేసింది. దీంతో నిమిష ప్రియ భవితవ్యం ఏమవుతుందనే ఉత్కంఠ కొనసాగుతోంది.