Page Loader
Amaravati: అమరావతి అభివృద్ధి కోసం కీలక రహదారి విస్తరణలు.. టెండర్లు పిలిచిన ఏడీసీ
అమరావతి అభివృద్ధి కోసం కీలక రహదారి విస్తరణలు.. టెండర్లు పిలిచిన ఏడీసీ

Amaravati: అమరావతి అభివృద్ధి కోసం కీలక రహదారి విస్తరణలు.. టెండర్లు పిలిచిన ఏడీసీ

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 09, 2025
08:15 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మౌలిక వసతుల అభివృద్ధి చర్యల్లో భాగంగా, ఇ-13 రహదారిని చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారి (ఎన్‌హెచ్-16)తో కలిపేందుకు, అలాగే ఇ-15 రహదారిని మంగళగిరిలోని పాత బస్టాండ్ వరకూ విస్తరించేందుకు అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) టెండర్లు ఆహ్వానించింది. ఈ ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం ఖర్చు అంచనాలు విడుదల చేసింది. ఇ-13 రహదారికి రూ.384.78 కోట్లు, ఇ-15కి రూ.70 కోట్లు ఖర్చు అవుతుందని పేర్కొంది. అసలైన రాజధాని మాస్టర్‌ప్లాన్ ప్రకారం ఈ రహదారులను జాతీయ రహదారి వరకు విస్తరించాలన్న ప్రణాళిక లేదు. అయితే,అమరావతికి ఇతర ప్రాంతాల నుంచి చక్కటి రాకపోకలు ఏర్పడాలన్నఉద్దేశంతో తాజా నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఈ క్రమంలో ఇ-5,ఇ-11,ఇ-13,ఇ-15 రహదారుల విస్తరణకు కసరత్తు మొదలైంది.

వివరాలు 

ఇ-13 రహదారి యర్రబాలెం వద్ద ముగుస్తుంది

డీపీఆర్ (డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) తయారీ బాధ్యతను లీ కన్సల్టెన్సీకి అప్పగించారు. ఇ-15 రహదారి అమరావతి పశ్చిమ బైపాస్ దగ్గర ప్రారంభమవుతుంది. దీన్ని మంగళగిరిలోని పాత బస్టాండ్ వరకు తీసుకెళ్తారు. రహదారి పొడవు రాజధాని సరిహద్దు నుంచి మంగళగిరి పాత బస్టాండ్ వరకూ 2.3 కిలోమీటర్లు ఉంటుంది. పాత మద్రాసు రహదారితో ఈ రహదారిని కలిపేందుకు అక్కడ ఓ ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. ఫ్లైఓవర్‌తో సహా మొత్తం పొడవు 3.52 కిలోమీటర్లుగా ఉంటుంది. ఇ-13 రహదారి యర్రబాలెం వద్ద మాస్టర్‌ప్లాన్ ప్రకారం ముగుస్తుంది. ఇప్పుడైతే దీనిని ఎయిమ్స్‌కు ఉత్తరంగా ఉన్న సరిహద్దు వెంట తీసుకెళ్లి నేరుగా జాతీయ రహదారి వరకూ పొడిగించనున్నారు.

వివరాలు 

 రహదారి మొత్తం పొడవు 7.2 కీ.మీ

డీజీపీ కార్యాలయం సమీపంలో ఎన్‌హెచ్-16తో ఈ రహదారిని అనుసంధానిస్తారు. అక్కడ ట్రంపెట్‌ ఆకారంలో ర్యాంప్‌లు,లూప్‌లు నిర్మించనున్నారు. ఇవన్నీ కలిపి ఈ రహదారి మొత్తం పొడవు 7.2 కిలోమీటర్లుగా ఉంటుంది. ఇ-13, ఇ-15 రహదారుల నిర్మాణాన్ని రాజధాని పరిధిలో కాకుండా బయట ప్రాంతాల్లోనూ వరద నీటి డ్రెయిన్‌లు, యుటిలిటీ డక్ట్‌లు వంటి మౌలిక సదుపాయాలతో కలిపి అభివృద్ధి చేస్తారు.

వివరాలు 

తదుపరి దశలో ఇ-5, ఇ-11 రహదారుల విస్తరణ 

ఇ-5, ఇ-11 రహదారుల విస్తరణకు రెండో దశలో టెండర్లు ఆహ్వానించనున్నారు. ఈ రహదారులను కూడా ఎన్‌హెచ్-16తో అనుసంధానించాలన్నది లక్ష్యం. భూసేకరణ అవసరం లేకుండా తాడేపల్లిలోని కొండల సరిహద్దుగా ఈ రహదారులను తీసుకెళ్లి జాతీయ రహదారిలో కలపాలన్నది ప్రణాళిక. ఇ-5 రహదారి ప్రతిపాదిత మార్గంలో కొంత అటవీ భూమి ఉంది. అందువల్ల రహదారి నిర్మాణానికి కేంద్ర అటవీ మరియు పర్యావరణ శాఖ అనుమతి అవసరం. ప్రస్తుతం ఈ అనుమతుల కోసం సంప్రదింపులు కొనసాగుతున్నాయి. అటవీశాఖ ఆమోదిస్తే, రహదారి మార్గరేఖ (alignment) ఖరారు చేస్తారు. ఇక ఇ-11 రహదారికి సంబంధించి డీపీఆర్ తయారీ దశలో ఉంది. ఇది పూర్తయిన వెంటనే దానికి సంబంధించి టెండర్ల ప్రక్రియ ప్రారంభిస్తారు.