
Kerala: కేరళ తీరంలో సింగపూర్ జెండాతో కూడిన ఓడలో పేలుడు.. స్పందించిన నేవీ
ఈ వార్తాకథనం ఏంటి
కేరళ సముద్ర తీరంలో సోమవారం ఉదయం భారీ నౌకా ప్రమాదం సంభవించింది. సింగపూర్ జెండాతో కలిగిన భారీ కంటైనర్ నౌక ఎంవీ వాన్ హై 503లో హఠాత్తుగా పేలుడు జరిగింది. ఈ అనూహ్య ఘటనతో నౌకలో ఉన్న సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందిన వెంటనే భారత నౌకాదళం స్పందించి హుటాహుటిన రక్షణ చర్యలు చేపట్టింది. ఈ ఘటనకు సంబంధించి రక్షణ శాఖ ప్రతినిధి వెల్లడించిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం సుమారు 10:30 సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు వెల్లడించారు. ఇది కేరళ తీరానికి సమీపంలో జరిగింది.నౌక అంతర్గత భాగంలోనే పేలుడు జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయింది.
వివరాలు
సముద్రంపై గగనతల పర్యవేక్షణ
ప్రమాద వార్త విన్న భారత నౌకాదళం అప్రమత్తమై వెంటనే ఐఎన్ఎస్ సూరత్ యుద్ధనౌకను ఘటన స్థలానికి పంపింది. అదేవిధంగా ఐఎన్ఎస్ గరుడ్ అనే కొచ్చిన్ నేవల్ ఎయిర్ స్టేషన్ నుంచి డోర్నియర్ నిఘా విమానంను ప్రయోగించి,సముద్రంపై గగనతల పర్యవేక్షణ ప్రారంభించారు. ఈ చర్యల ద్వారా నౌకలోని సిబ్బంది పరిస్థితి, నౌక స్థితిగతులు పరిశీలించారు. ప్రమాదానికి గురైన ఎంవీ వాన్ హై 503 అనేది సుమారు 270మీటర్ల పొడవుతో కూడిన ఒక భారీ కంటైనర్ నౌక. ఈ నౌక తన ప్రయాణాన్ని జూన్ 7వ తేదీన శ్రీలంక రాజధాని కొలంబో ఓడరేవు నుంచి ప్రారంభించింది. షెడ్యూల్ ప్రకారం,జూన్ 10వ తేదీన ముంబై చేరాల్సి ఉంది.అయితే మార్గమధ్యంలో, కేరళ తీరానికి సమీపంలో ఈ పేలుడు సంభవించింది.
వివరాలు
లైబీరియా దేశానికి చెందిన 24 మంది సిబ్బందిని రక్షించిన ఇండియన్ కోస్ట్ గార్డ్
ఇటీవల కేరళ తీరంలో మరొక నౌక ప్రమాదానికి గురైంది. లైబీరియా దేశానికి చెందిన ఎంఎస్‌సీ ఎల్సా-3 అనే నౌక, కేరళ తీరానికి సుమారు 38 నాటికల్ మైళ్ల దూరంలో ఒక్కసారిగా ఒకవైపునకు ఒరిగిపోయింది. దీంతో నౌకలోని కొన్ని కంటైనర్లు నేరుగా సముద్రంలో పడిపోయాయి. ఈ ప్రమాదానికి స్పందించిన ఇండియన్ కోస్ట్ గార్డ్, నౌకలోని 24 మంది సిబ్బందిని సురక్షితంగా రక్షించి ఒడ్డుకు చేర్చింది. ఆ నౌకలో చమురు, ఫర్నేస్ ఆయిల్, అలాగే కాల్షియం కార్బైడ్ వంటి ప్రమాదకరమైన రసాయనాలు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు.