
Pulwama Attack:పుల్వామా ఉగ్రదాడికి పేలుడు పదార్థాన్ని ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా కొనుగోలు చేశారు: గ్లోబల్ టెర్రర్ వాచ్‌డాగ్
ఈ వార్తాకథనం ఏంటి
ఈ-కామర్స్ వేదికలు, ఆన్‌లైన్ పేమెంట్ సర్వీసులపై ఉగ్రవాద సంస్థలు చూపిస్తున్న దుర్వినియోగంపై ఆర్థిక చర్యల కార్యదళం (FATF) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. భారత్‌లో 2019లో చోటుచేసుకున్న పుల్వామా ఉగ్రదాడి, 2022లో గోరఖ్‌నాథ్ ఆలయంపై జరిగిన దాడిని దీనికి ఉదాహరణలుగా FATF పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా మనీలాండరింగ్, ఉగ్రవాద నిధుల నిర్మూలన కోసం పని చేసే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ తన తాజా నివేదికలో కీలక విషయాలను వెల్లడించింది. ఉగ్రవాద గుంపులు డిజిటల్ సాధనాలను, ఆర్థిక సాంకేతికతను ఎలా దుర్వినియోగం చేస్తూ నిధులను సమీకరిస్తున్నాయో, వాటిని ఎలా తరలిస్తున్నాయో ఈ నివేదిక స్పష్టంగా వివరించింది.
వివరాలు
40 మంది జవానులు మృతి
2019లో జరిగిన పుల్వామా ఉగ్రదాడిలో CRPF జవానులను తీసుకెళ్తున్న వాహనాన్ని ఐఈడీతో పేల్చివేశారు ఈ పేలుడు కోసం అవసరమైన పదార్థాల్లో ఒకటైన అల్యూమినియం పొడిని ఉగ్రవాదులు ఈ-కామర్స్ వేదికలో ఆర్డర్ చేసి తెప్పించుకున్నట్లు FATF వెల్లడించింది. ఈ ఘోరమైన ఘటనలో 40 మంది జవానులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి పాక్‌కు చెందిన జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ సంబంధం కలిగినట్లు భారత నిఘా సంస్థలు గుర్తించాయి. బాంబు తయారీ, లాజిస్టిక్స్ ఏర్పాటులో ఆన్‌లైన్ వేదికల వాడకాన్ని కూడా నివేదిక పేర్కొంది.
వివరాలు
2022లో గోరఖ్‌నాథ్ ఆలయంపై దాడి
2022లో గోరఖ్‌నాథ్ ఆలయంపై జరిగిన దాడిని మరో ఉదాహరణగా FATF చేర్చింది. ఐసిస్ భావజాలంతో మత్తెక్కిన ఓ వ్యక్తి ఆలయ భద్రతా సిబ్బందిపై హింసాత్మకంగా దాడి చేశాడు. అతను ఇస్లామిక్ స్టేట్ కార్యకలాపాలకు మద్దతుగా 6.7 లక్షల రూపాయలు పేపాల్ ద్వారా విదేశాలకు పంపినట్లు వెల్లడైంది. పేపాల్ ఈ అనుమానాస్పద లావాదేవీలను గమనించి ఆ ఖాతాను తాత్కాలికంగా నిలిపివేసింది. ఉగ్రవాదులు గుర్తించలేని, సులభంగా మారిపోయే, తక్కువ ఖర్చుతో నడిచే చెల్లింపుల మార్గాలను ఎలా వాడుకుంటున్నారనే దానికి ఇది స్పష్టమైన ఉదాహరణగా FATF అభిప్రాయపడింది.
వివరాలు
ఉగ్రవాద సంస్థలకు నేరుగా లేదా పరోక్షంగా మద్దతుగా నిలుస్తున్న విషయాన్ని సూచించిన నివేదిక
గత పదేళ్లుగా ఫిన్‌టెక్ సేవలు విస్తరిస్తున్న సమయంలో, ఉగ్రవాదుల ఆర్థిక కార్యకలాపాలకు ఇది కొత్త మార్గాలను అందించిందని FATF పేర్కొంది. చిన్నచిన్న వస్తువులను ఆన్‌లైన్‌లో విక్రయించడం,బాంబుల తయారీకి అవసరమైన త్రీడీ ప్రింటెడ్ భాగాల కోసం రసాయనాలు,ఇతర భాగాలను విక్రయించడం,లేదా సామాజిక మాధ్యమాల ద్వారా విరాళాలు సేకరించడం వంటి మార్గాల ద్వారా ఉగ్రవాద సంస్థలు తమ ఆర్థిక శక్తిని పెంచుకుంటున్నట్లు నివేదిక పేర్కొంది. వీటిని గుర్తించడం,పర్యవేక్షించడం అత్యంత క్లిష్టమైన అంశంగా ఉన్నదని హెచ్చరించింది. ఇతర కొన్ని దేశాలు ఈ ఉగ్రవాద సంస్థలకు నేరుగా లేదా పరోక్షంగా మద్దతుగా నిలుస్తున్న విషయాన్ని నివేదిక సూచించింది.
వివరాలు
డిజిటల్ ఫైనాన్షియల్ సేవల వినియోగంపై నిఘా పెట్టాలని FATF సిఫారసు
అయితే ఈ దేశాల పేర్లను మాత్రం వెల్లడించలేదు. ఈ-కామర్స్ వేదికలు, విపీఎన్‌లు, డిజిటల్ ఫైనాన్షియల్ సేవల వినియోగంపై ఆయా దేశాలు కఠినంగా నిఘా పెట్టాలని FATF సిఫారసు చేసింది. ఉగ్రవాదులు ఈ వేదికలను ఉపయోగించుకుని తమకు అవసరమైన వస్తువులు సులభంగా పొందుతూ, ఆర్థిక కార్యకలాపాలను నిర్వర్తిస్తూ, ఉగ్రకార్యచరణలు సాధ్యపడేలా చేస్తున్నారని పేర్కొంది. పాకిస్థాన్ అనేక ఉగ్రవాద సంఘటనా కార్యకలాపాలకు ఆధారంగా మారిందని,అందువల్లే దాన్ని గ్రే లిస్ట్‌లో ఉంచాలని భారత్ ఎప్పటికప్పుడూ FATF ను కోరుతూ వస్తోంది. ఇటీవల పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని FATF ఖండించింది. డిజిటల్ మౌలిక వసతులు, ఆర్థిక సహాయాలు లేకుండా అటువంటి దాడులు సాధ్యపడవని స్పష్టం చేసింది.