
రాజస్థాన్ కాంగ్రెస్‌లో వర్గపోరు; అధిష్టానం హెచ్చరికను లెక్కచేయకుండా సచిన్ పైలెట్ నిరాహార దీక్ష
ఈ వార్తాకథనం ఏంటి
రాజస్థాన్ కాంగ్రెస్‌లో మళ్లీ వర్గపోరు తెరపైకి వచ్చినట్లు కనిపిస్తోంది. సీఎం అశోక్ గెహ్లాట్- కాంగ్రెస్ సీనియర్ నేత సచిన్ పైలట్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.
సచిన్ పైలట్ మంగళవారం ఏకంగా సొంత ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా నిరాహార దీక్షకు దిగడంతో పార్టీలోని విబేధాలు మరోసారి బట్టబయలు అయ్యాయి. నిరాహార దీక్షకు దిగొద్దని పైలట్‌ను హైకమాండ్ హెచ్చరించినప్పటికీ, ఆయన లెక్కచేయకుండా నిరాహార దీక్షకు దిగారు.
వసుంధర రాజే హయాంలో బీజేపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని ప్రభుత్వం చర్య తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ ఈ నిరాహార దీక్ష చేపడుతున్నట్లు సచిన్ పైలెట్ ప్రకటించారు.
అయితే పరోక్షంగా అశోక్ గెహ్లాట్‌ను లక్ష్యంగా చేసుకొని ఈ దీక్షను పైలెట్ చేపట్టినట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్
2018 నుంచి పైలెట్ వర్సెస్ గెహ్లాట్
2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పీసీసీ చీఫ్‌గా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి సచిన్ పైలెట్ తీవ్రంగా శ్రమించారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రిగా తనకు అధిష్ఠానం అవకాశం ఇస్తుందని ఆశించారు. అయితే అనూహ్యంగా అశోక్ గెహ్లాట్‌ను కాంగ్రెస్ అధిష్ఠానం సీఎంగా ప్రకటించింది.
ఈ క్రమంలో అప్పటి నుంచి అశోక్ గెహ్లాట్‌పై తన విమర్శన బాణాలను సంధిస్తూనే ఉన్నారు. 2020లో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని విశ్వప్రయత్నం చేసి విఫలమయ్యారు. ఫలితంగా తన పీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎం పదవిని కూడా పైలెట్ కోల్పోవాల్సి వచ్చింది.
తన ప్రభుత్వాన్ని పడగొట్టడానికి పైలెట్ బీజేపీతో కుమ్మక్కయ్యారని గత ఏడాది జరిగిన భారత్ జోడో యాత్ర సందర్భంగా గెహ్లాట్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా పైలెట్‌ను దేశద్రోహిగా పిలిచారు.
కాంగ్రెస్
పైలెట్ నిరాహార దీక్షను పార్టీ వ్యతిరేక చర్య: అధిష్టానం
రాజస్థాన్‌లో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గెహ్లాట్- సచిల్ పైలెట్ మధ్య విబేధాలు తారా స్థాయికి చేరుకున్నాయి.
ఎన్నికల నేపథ్యంలో తన ప్రాభాల్యాన్ని చూపించడంతో పాటు గెహ్లాట్‌ను ఇబ్బందే పెట్టే ఉద్దేశంతోనే సచిన్ పైలెట్ మంగళవారం నిరాహార దీక్షకు దిగినట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
కాంగ్రెస్ అధిష్ఠానం పైలట్‌కు సోమవారం రాత్రి గట్టిగానే హెచ్చరించింది. పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేయడం "పార్టీ వ్యతిరేక చర్య"గా కాంగ్రెస్ అభివర్ణించింది.
పైలట్ నిరాహార దీక్ష పార్టీ ప్రయోజనాలకు విరుద్ధమని రాజస్థాన్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ఇన్‌ఛార్జ్ సుఖ్‌జీందర్ సింగ్ రంధావా అన్నారు. సమస్యలపై మీడియాలో, ప్రజావాణిలో కాకుండా పార్టీ వేదికల్లోనే చర్చించుకోవచ్చని చెప్పారు.
కాంగ్రెస్
బీజేపీకి ఆయుధంగా మారిన పైలెట్ వ్యవహారం
రాజస్థాన్‌లో పైలెట్ వ్యవహారం బీజేపీకి ఆయుధంగా మారినట్లు కనిపిస్తోంది. పైలెట్ నిరాహార దీక్ష వల్ల రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రెండుగా చీలిపోయినట్లు కనిపిస్తోందని బీజేపీ నేత అర్జున్ రామ్ మేఘ్వాల్ ఆరోపించారు.
రాజస్థాన్‌లో అభివృద్ధి, పాలన లేదని, ఈ ఏడాది జరగనున్న ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించుతారని అన్నారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ అంశాన్ని బీజేపీ ప్రచారాస్త్రంగా మల్చుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నిరాహార దీక్షలో కూర్చున్న సచిల్ పైలెట్
#WATCH | Rajasthan Congress leader Sachin Pilot at Shaheed Samark in Jaipur begins his daylong fast calling for action on alleged corruption during the previous BJP government in the state pic.twitter.com/PeFLSRbYMq
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) April 11, 2023