ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన వేపాడ చిరంజీవి ఎవరంటే?
ఉత్తరాంధ్ర(విశాఖపట్నం, శ్రీకాకులం, విజయనగరం) పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ బలపర్చిన అభ్యర్థి వేపాడ చిరంజీవి రావు విజయం సాధించారు. ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన ఈ చిరంజీవి ఎవరు? ఆయన ఇది వరకు ఏం చేసేవారు? ఆయన కుటుంబ నేపథ్యంం ఏంటి? ఉత్తరాంధ్రలో ఎంతో బలంగా ఉన్న వైసీపీ బలపర్చిన సీతంరాజు సుధాకర్‌పై గెలుపొందిన వేపాడ చిరంజీవి రావు పేరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానంగా వినిపిస్తోంది. తొలి ప్రాధాన్యతో ఓట్ల లెక్కింపు ముందంజలో ఉన్న వేపాడ చిరంజీవిరావుకు విజయానికి కావాల్సిన ఓట్లు రాలేదు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించాల్సి వచ్చింది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో విజయానికి అవసరమైన మెజార్టీ రావడంతో తొలిసారి మండలిలో అడుగు పెట్టబోతున్నారు.
వేపాడ చిరంజీవిరావు కుటుంబ, వృత్తి నేపథ్యం
చిరంజీవి రావు అర్థశాస్త్ర అధ్యాపకుడు. ఆయనను అందరకీ ఎకానమీ చిరంజీవిగా సుప్రసిద్ధులు. అనకాపల్లి జిల్లా రావికమతం మండలం దొండపూడికి చెందిన చిరంజీవి 1972లో ఒక సామాన్య కుటుంబంలో జన్మించారు. ఏయూ నుంచి అర్థశాస్త్రంలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. 1996 డీఎస్సీలో ఎస్జీటీగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన చిరంజీవి, ఆ తర్వాత స్కూల్ అసిస్టెంట్, జూనియర్, డిగ్రీ కళాశాల అధ్యాపకుడిగా పనిచేశారు. ఇటీవలే వీఆర్ఎస్ తీసుకున్నారు. చిరంజీవి భార్య నివేదిత కూడా విశాఖలోని వీఎస్ కృష్ణ డిగ్రీ కలాశాలలో అధ్యపకురాలిగా పని చేస్తున్నారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థపై చిరంజీవి ఆరు పుస్తకాలు రాశారు. విశాఖ ఎంవీపీ కాలనీలోని ఆర్‌సీ రెడ్డి కోచింగ్ సెంటర్‌లో గ్రూప్స్‌తో పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తుంటారు.