కర్ణాటక మంత్రి దారుణ వ్యాఖ్యలు.. పరిహారం కోసమే రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వ్యాఖ్య
కర్ణాటకలో చెరుకు, వ్యవసాయ ఉత్పత్తుల శాఖ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేగింది. పరిహారం కోసమే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని మంత్రి శివానంద్ పాటిల్ అన్నారు. మరణించిన అన్నదాతల కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని పెంచినప్పటి నుంచి వారి ఆత్మహత్యల సంఖ్య పెరిగిందని పాటిల్ చెప్పుకొచ్చారు. దీంతో రైతు సంఘాలు మంత్రిపై తీవ్రంగా దుమ్మెత్తి పోస్తున్నాయి. మీ కుటుంబానికి రూ.50 లక్షలు పరిహారం ఇస్తే మీరు ఆత్మహత్య చేసుకుంటారా అంటూ చురకలు అంటించారు. ఈ మేరకు పాటిల్ వెంటనే రాజీనామా చేయాలని సంఘాలు డిమాండ్ చేశాయి. ఒకవేళ ఆయన రాజీనామా చేయకుంటే కర్ణాటక మంత్రివర్గం నుంచి తొలగించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కోరుతున్నారు.
గతంలోనూ మంత్రి శివానంద్ పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలు
కర్ణాటక రాష్ట్ర అన్నదాతలపై మంత్రి పాటిల్ తీవ్ర వ్యాఖ్యలకుగానూ రైతు సంఘం నేత మల్లికార్జున్ బళ్లారి మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న వ్యతిరేకతతో మంత్రి తన తప్పును సరిదిద్దుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే తాను రైతుల మనోభావాలను దెబ్బతీయాలని కోరుకోలేదని మంత్రి శివానంద్ పాటిల్ వివరణ ఇచ్చారు. అన్నదాతల ఆత్మహత్యలపై చెప్పే ముందు ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదిక కోసం వేచి ఉండాలని మీడియాకు, ప్రజలకు సూచనలు చేశారు. ఈ మేరకు మరింత బాధ్యతగా వ్యవహరించాలని సూచిస్తున్నట్లు తెలిపారు. గతంలోనూ మంత్రి శివానంద్ పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజకీయంలో భాగంగానే అలా మాట్లాడినట్లు విమర్శలు వస్తున్నాయి.