Farmers protest: 'దిల్లీ మార్చ్' ఫిబ్రవరి 29కి వాయిదా.. నేడు సరిహద్దులో కొవ్వొత్తల ర్యాలీ
సమస్యలు పరిష్కరించాలని హర్యానా-పంజాబ్ సరిహద్దులో ఆందోళన చేస్తున్న రైతులు.. 'దిల్లీ చలో' కార్యక్రమాన్ని ఫిబ్రవరి 29కి వాయిదా వేశారు. ఐక్య కిసాన్ మోర్చా (నాన్ పొలిటికల్), రైతు ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న కిసాన్ మజ్దూర్ మోర్చా నాయుకులు ఈ విషయాన్ని వెల్లడించారు. రైతు నాయకుడు సర్వన్ సింగ్ పంధేర్ మాట్లాడుతూ.. పంజాబ్-హర్యానాలోని శంభు, ఖానౌరీ సరిహద్దుల వద్ద శనివారం కొవ్వొత్తుల ర్యాలీ ఉంటుందని, ఆ తర్వాత తదుపరి వ్యూహం రూపొందిస్తామని చెప్పారు. మరో రైతు పంధేర్ మాట్లాడుతూ.. ఫిబ్రవరి 26న డబ్ల్యూటీవో, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేస్తామని, ఫిబ్రవరి 27న పలు రైతు సంఘాల సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. ఫిబ్రవరి 29న రైతులు ఉద్యమంలో తమ తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామన్నారు.
హర్యానా పోలీసు అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి: రైతుల డిమాండ్
ఖానౌరీ సరిహద్దులో మోహరించిన హర్యానా పోలీసులు, అధికారులపై పంజాబ్ ప్రభుత్వం ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని రైతు నాయకుడు జగ్జిత్ సింగ్ దల్లెవాల్ డిమాండ్ చేసారు. రైతు శుభకరన్ సింగ్ మృతి కేసులో పంజాబ్ ప్రభుత్వం ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం లేదన్నారు. డిమాండ్లు నెరవేరే వరకు ఆయన దహన సంస్కారాలు చేయబోమన్నారు. ఇదిలా ఉంటే, మరణించిన శుభకరన్ సింగ్ కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారాన్ని, అతని సోదరికి ప్రభుత్వ ఉద్యోగాన్ని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రకటించారు. అంతకుముందు, ఖనౌరీ సరిహద్దులో నిరసన సమయంలో, బటిండా నివాసి 62 ఏళ్ల రైతు దర్శన్ సింగ్ కూడా గుండెపోటుతో మరణించాడు. ఇప్పటివరకు మొత్తం 4 మంది రైతులు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయారు.