Page Loader
మద్దతు ధర కోసం కురుక్షేత్ర-ఢిల్లీ జాతీయ రహదారిని దిగ్బంధించిన రైతులు 
మద్దతు ధర కోసం కురుక్షేత్ర-ఢిల్లీ జాతీయ రహదారిని దిగ్బంధించిన రైతులు

మద్దతు ధర కోసం కురుక్షేత్ర-ఢిల్లీ జాతీయ రహదారిని దిగ్బంధించిన రైతులు 

వ్రాసిన వారు Stalin
Jun 12, 2023
05:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

పొద్దుతిరుగుడు పంటను కనీస మద్దతు ధరకు(ఎంఎస్‌పీ) కొనుగోలు చేయకూడదన్న హర్యానా ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కురుక్షేత్రలో రైతులు సోమవారం మహాపంచాయత్ నిర్వహించారు. అనంతరం దిల్లీకి వెళ్లే జాతీయ రహదారిని(ఎన్‌హెచ్) దిగ్బంధించారు. హర్యానాలోని కురుక్షేత్రలో రోడ్లపై తమ ట్రాక్టర్‌లతో దిల్లీకి వెళ్లే జాతీయ రహదారిని చుట్టుముట్టారు. తొలుత కురుక్షేత్ర జిల్లాలోని పిప్లి సమీపంలోని ఫ్లై ఓవర్‌పై వారు గుమిగూడారు. ఆ తర్వాత ఆందోళనకు దిగారు. మహాపంచాయత్‌లో భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేష్ టికాయిత్ సహా కీలక రైతు నాయకులతో పాటు, రెజ్లర్ బజరంగ్ పునియా కూడా ఉన్నారు. రెజ్లర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న అగ్రశ్రేణి రెజ్లర్లలో పునియా ఒకరు.

రైతులు

జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం 

కురుక్షేత్రలో మహాపంచాయత్ నేపథ్యంలో దిల్లీ-చండీగఢ్ జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం పొద్దుతిరుగుడు పంటను ఎంఎస్‌పీకి కొనుగోలు చేయడం లేదని, తమ ఉత్పత్తులను క్వింటాల్‌కు రూ. 6,400 ఎంఎస్‌పీకి కొనాలని డిమాండ్ చేశారు. మద్దతు ధరకు కొనకపోవడంతో రూ.4,000 చొప్పున ప్రైవేట్ కొనుగోలుదారులకు విక్రయించాల్సి వచ్చిందని నిరసన వ్యక్తం చేసిన రైతులు పేర్కొన్నారు. రైతులు జూన్ 6న కురుక్షేత్రలో దిల్లీ-అమృత్‌సర్ జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఆ తర్వాత వారిని చెదరగొట్టేందుకు పోలీసులు వారిపై లాఠీచార్జి చేశారు. అనంతరం రైతు నాయకులను అరెస్టు చేశారు.