1,200 ట్రాక్టర్లతో 'ఢిల్లీ చలో'కు సిద్ధమైన రైతులు.. పంజాబ్, హరియాణా సరిహద్దులో హై అలర్ట్
పంటకు కనీస మద్దతు ధర విషయంపై కేంద్రంలో చర్చలు విఫలమైన కారణంగా ఢిల్లీ చలో నిరసనలు తిరిగి ప్రారంభించేందుకు రైతులు సిద్ధమయ్యారు. దాదాపు 14,000మంది రైతులు 1,200ట్రాక్టర్లు, 300కార్లు, 10మినీ బస్సులతో పంజాబ్, హర్యానా సరిహద్దు వద్ద మోహరించారు. రైతులు నిరసనలు సిద్ధ కావడంతో ఢిల్లీ పోలీసులు అలర్ట్ అయ్యారు. దేశ రాజధానిలోకి రైతులు ప్రవేశించకుండా పటిష్ట భద్రతతో సరిహద్దుల వద్ద బారీకేడ్లు ఏర్పాటు చేశారు. సరిహద్దులు రైతులు భారీగా మోహరించడంతో పంజాబ్ ప్రభుత్వానికి కేంద్ర హోం శాఖ లేఖ రాసింది. రైతులు ముసుగులో కొందరు సరిహద్దుకు చేరుకున్నట్లు పంజాబ్ ప్రభుత్వానికి లేఖలో పేర్కొంది. బారీకేడ్లు చెదరగొట్టేందుకు భారీ యంత్రాలను రైతులు సరిహద్దుకు తరలించినట్లు హోం శాఖ ఆందోళన వ్యక్తం చేసింది.
ముగిసిన డెడ్ లైన్
పంటలకు కనీస మద్దతు ధర కోసం చట్టం తేవాలని రైతులు కేంద్రానికి విధించిన డెడ్ లైన్ ఈరోజుతో ముగిసింది. దీంతో దిల్లీలో పెద్ద ఎత్తున నిరసలు చేపట్టేందుకు రైతులు సిధ్దమయ్యారు. కనీస మద్దతు ధర కోసం కేంద్రం ఒకరోజు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని రైతు నాయకుడు సర్వాన్ సింగ్ డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి నిజంగా రైతులకు మేలు చేయాలనుకుంటే ఒక రోజు సెషన్ నిర్వహించాలన్నారు. దీనికి ప్రతిపక్షం వ్యతిరేకంగా ఉండదని చెప్పారు. దిల్లీ చలో మార్చ్‌ను అడ్డుకునేందుకు కేంద్రం హరియాణ గ్రామాల్లో పారామిలిటరీ బలగాలను మోహరించిందని సర్వాన్ సింగ్ పేర్కొన్నారు. తాము చేసిన తప్పేంటని ప్రశ్నించారు. తమను అణచివేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.