
UP: యూపీలో ఘోర రోడ్డుప్రమాదం.. వరుడుతో సహా 8 మంది మృతి
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. వివాహానికి బయలుదేరిన బొలెరో ఎస్‌యూవీ కారు అదుపుతప్పి ఓ కళాశాల గోడను ఢీకొట్టింది. ఈ భయానక ఘటనలో వరుడు సహా ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దుర్ఘటన జెవానై గ్రామంలో ఉదయం 6:30 గంటల సమయంలో జరిగింది. హర్ గోవింద్‌పూర్ గ్రామానికి చెందిన వరుడు సూరజ్ (24) తన కుటుంబ సభ్యులతో కలిసి బుడాన్ జిల్లాలోని సిర్టౌల్ గ్రామంలో వధువు ఇంటికి వెళ్తుండగా, ఈ ఘటన జరిగింది
Details
కేసు నమోదు చేసుకున్న పోలీసులు
ఉదయం రోడ్లు ఖాళీగా ఉండటంతో డ్రైవర్ అధిక వేగంతో కారు నడిపాడు. వేగం వల్ల నియంత్రణ కోల్పోయిన వాహనం జనతా ఇంటర్ కాలేజీ గోడను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వరుడు సూరజ్ అక్కడికక్కడే మృతిచెందాడు. మిగతా మృతుల్లో వరుడి వదిన ఆశా (26), ఆమె కుమార్తె ఐశ్వర్య (2), మనోజ్ కుమారుడు విష్ణు (6), వరుడి అత్త, గుర్తు తెలియని ఇద్దరు మైనర్లు, మరో ఇద్దరు కుటుంబ సభ్యులు ఉన్నారు. వారంతా ఒకే కుటుంబానికి చెందినవారని గుర్తించారు. ఇద్దరు తీవ్రంగా గాయపడగా, వారిని అలీఘర్‌లోని ఉన్నత వైద్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని అదనపు పోలీసు సూపరింటెండెంట్ (సౌత్) అనుకృతి శర్మ సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.