AP budget: చివరి దశకు బడ్జెట్ రూపకల్పన.. కీలక శాఖలకు భారీగా కేటాయింపులు.!
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది.ఈ బడ్జెట్ ప్రధాన లక్ష్యం రాష్ట్ర GSDP వృద్ధి రేటును 15% పెంచడం, 2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి సాధించడం.
దీని కోసం ప్రభుత్వం మూలధన వ్యయాన్ని పెంచుతూ, దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు సాగాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు తగిన నిధులను కేటాయించడం మాత్రమే కాకుండా, వాటి ఆర్థిక ప్రభావాన్ని సమీక్షించేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది.
ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాల అమలుకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది.
వివరాలు
అమరావతి అభివృద్ధి
సూపర్ సిక్స్ పథకాల్లో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, దీపం 2.0, సామాజిక భద్రతా పెన్షన్లు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ కీలకమైనవి.
వీటిలో కొన్ని ఇప్పటికే అమలులో ఉండగా, మరికొన్ని త్వరలో అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఈ సంక్షేమ పథకాలను అమలు చేయడానికి భారీగా నిధులు అవసరం.
రాష్ట్రంలో ఆర్థిక లోటు ఉన్నప్పటికీ, సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టంగా వెల్లడించారు.
రాజధాని అమరావతి అభివృద్ధిని అత్యంత ప్రాముఖ్యతతో తీసుకున్న ప్రభుత్వం, మూడు సంవత్సరాల్లో రూ.60,000 కోట్ల వ్యయంతో నిర్మాణ పనులు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
వివరాలు
బడ్జెట్ సమీక్షలు.. నిధుల కేటాయింపు
అంతర్జాతీయ సంస్థలైన వరల్డ్ బ్యాంక్, ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ లాంటి ఆర్థిక సంస్థల నుండి రూ.30,000 కోట్ల పైగా రుణాలు పొందేందుకు హామీ తెచ్చుకున్నట్లు తెలుస్తోంది.
బడ్జెట్ సందర్భంగా దీనిపై మరింత స్పష్టత రానుంది. ఈ బడ్జెట్‌లో పట్టణ పునరుద్ధరణ ప్రాజెక్టులు, మెరుగైన రహదారి కనెక్టివిటీ, పరిశ్రమల వృద్ధి, పునరుత్పత్తి శక్తి రంగాల్లో పెట్టుబడులకు పెద్దపీట వేయనున్నారు.
ముఖ్యంగా, డిజిటల్ గవర్నెన్స్, ఐటీ హబ్‌ల అభివృద్ధి, తయారీ పరిశ్రమల వృద్ధి, విద్య, ఆరోగ్య రంగాలకు అధిక నిధులు కేటాయించనున్నారు.
విద్యా రంగంలో పాఠశాలల మౌలిక సదుపాయాల మెరుగుదల, ఆరోగ్య రంగంలో ఉచిత ఆరోగ్య సంరక్షణ పథకాలు, గ్రామీణ ఆరోగ్య కేంద్రాల బలోపేతం ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
వివరాలు
బడ్జెట్ లక్ష్యాలు..విశ్లేషణలు
మొత్తం 28 శాఖల బడ్జెట్ సమీక్షలు పూర్తయ్యాయి. మంత్రులు తమ శాఖలకు అధిక నిధులు కేటాయించాలని కోరగా, ఇరిగేషన్ శాఖ రూ.37,000 కోట్లు కోరగా, ప్రభుత్వం రూ.27,000 కోట్లు కేటాయించేందుకు సిద్ధంగా ఉంది.
చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే ఈ పూర్తి స్థాయి బడ్జెట్, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని స్థిరపరచేలా, సంక్షేమం, మౌలిక వసతుల అభివృద్ధి, పరిశ్రమల పెట్టుబడులకు సమతుల్యత కల్పించేలా ఉండబోతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.