ఒడిశా రైలు ప్రమాదంపై సీబీఐ విచారణ ఎందకంటే?
ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ఈ ప్రమాదంపై సమగ్ర దర్యాప్తును సీబీఐ మంగళవారం అధికారికంగా చేపట్టింది. మూడు రైళ్లు ఢీకొన్న ఈ ఘటనలో ఇప్పటి వరకు 278 మంది మృతి చెందగా, 1,100 మంది గాయపడ్డారు. నేరాలను పరిశోధించే సీబీఐకి రైలు ప్రమాద దర్యాప్తును అప్పగించడంపై కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ ట్యాంపరింగ్ అవడంతో ఈ ప్రమాదం జరిగినట్ల ప్రాథమిక విచారణలో తేలిందని రైల్వే వర్గాలు తెలిపాయి. ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ ట్యాంపరింగ్ అనేది మానవ ప్రమేయం వల్ల జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఇందులో సంఘ విద్రోహ శక్తుల హస్తం ఉందా? అనే కోణంలో సమగ్ర విచారణ చేపట్టేందుకు కేంద్రం సీబీఐకి అప్పగించింది.
సీబీఐకి అప్పగించడం వల్ల విచారణ త్వరగా పూర్తి
దర్యాప్తులో మానవ ప్రవేయం, సాంకేతిక సమస్య రెండూ ఉండవచ్చని పరిగణనలోకి తీసుకుంటే, ఇది సీబీఐ మాత్రమే పరిష్కరించదగిన కేసుగా నిపుణులు చెబుతున్నారు. భారతదేశంలో చాలా ప్రభుత్వ ఏజెన్సీలు అధునాతన సాంకేతిక పరిశోధనలను నిర్వహించడానికి సిద్ధంగా లేవు. ఇంటర్‌లాకింగ్ సిస్టమ్‌లో ఆకస్మిక మార్పు సమస్యను రాష్ట్ర, కిందిస్థాయి విచారణ సంస్థలకు అప్పగిస్తే, నివేదిక ఆసల్యం అవుతుంది. అది లక్షలాది జీవితాలను ప్రమాదంలో పడేస్తుంది. సీబీఐకి అప్పగించడం వల్ల విచారణ త్వరగా పూర్తయి, కచ్చితమైన సమాచారం తెలుస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఎన్నికల ఏడాది కావడంతో విచారణను త్వరగా పూర్తి చేసి, ప్రభుత్వం తప్పిదం లేదని, ఇంతటి విపత్తుకు కారమైన వారిని త్వరగా గుర్తించి దేశ ప్రజలకు చూపించేందుకు సీబీఐ విచారణ వల్లే జరుగుతుందని ప్రభుత్వం భావించింది.