
Sophia Qureshi: ఆర్మీ కల్నల్ సోఫియా ఖురేషిపై వివాస్పద వ్యాఖ్యలు.. బిజెపి మంత్రిపై మధ్యప్రదేశ్ కోర్టు ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశం
ఈ వార్తాకథనం ఏంటి
ఆర్మీలో సేవలందిస్తున్న కల్నల్ సోఫియా ఖురేషిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమ మంత్రి కున్వర్ విజయ్ షాపై మధ్యప్రదేశ్ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
ఆయన చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదు నమోదు చేయాలని రాష్ట్ర పోలీసులకు న్యాయస్థానం ఆదేశించింది.
ఇటీవల భారత్ పాకిస్థాన్‌పై 'ఆపరేషన్ సిందూర్' పేరిట ఒక సైనిక చర్య చేపట్టింది. ఈ ఆపరేషన్‌కు నాయకత్వం వహించిన కల్నల్ సోఫియా ఖురేషి తమ సాహసంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.
ఆపరేషన్‌లో చోటుచేసుకుంటున్న అంశాలను ఆమె సమయానికి మీడియాతో పంచుకుంటూ, దేశ ప్రజల ప్రశంసలు పొందారు. దీంతో ఆమె పేరు ఒక్కసారిగా దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది.
వివరాలు
కున్వర్ విజయ్ షా పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్
అయితే, ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రి కున్వర్ విజయ్ షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారి తీసాయి.
ఆయన మాట్లాడుతూ.."పాకిస్థాన్ ఉగ్రవాదులు మన దేశ సోదరీమణుల సిందూరాన్ని తుడిచేస్తుంటే, అదే మతానికి చెందిన ఓ మహిళ అయిన కల్నల్ సోఫియా ఖురేషిని ప్రధాని మోదీ పాకిస్థాన్‌పైకి పంపించారు" అని అన్నారు.
ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది.
దేశ గౌరవాన్ని దక్కించుకున్న ఓ మహిళపై ఇలాంటివి మాట్లాడటం సహించదగ్గ విషయం కాదని, వెంటనే మంత్రి తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు.
వివరాలు
విజయ్ షాపై కేసు నమోదు చేయాలని డీజీపీకి ఆదేశాలు
అంతేకాక, జాతీయ మహిళా కమిషన్ కూడా మంత్రి వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించింది.
తాజా పరిణామాల్లో ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో మరింతగా ప్రాచుర్యం పొందడంతో, మధ్యప్రదేశ్ హైకోర్టు ఈ వ్యవహారంపై కఠినంగా స్పందించింది.
వెంటనే మంత్రి కున్వర్ విజయ్ షాపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది.