Rahul Gandhi: అస్సాంలో 'హింస, దాడి' కేసులో రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలపై ఎఫ్ఐఆర్
కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్,ఇతర పార్టీ కార్యకర్తలపై కేసు నమోదు చేసినట్లు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మంగళవారం తెలిపారు. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రకుగౌహతిలోని ప్రధాన మార్గాల గుండా ప్రవేశించేందుకు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. హింసాత్మక చర్యలు,రెచ్చగొట్టడం,ప్రజా ఆస్తులను ధ్వంసం చేయడం,పోలీసు సిబ్బందిపై దాడి వంటి చర్యలకు కారణమైన రాహుల్ గాంధీ,కె.సి.వేణుగోపాల్,కన్హయ్య కుమార్ సహా ఇతర వ్యక్తులపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని హిమంత బిస్వా శర్మ'ఎక్స్'లో పోస్ట్ చేశారు. అస్సాం ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ యాత్రను గౌహతి నగరంలోని రద్దీ ప్రాంతాల్లోకి ప్రవేశించొద్దని దానికి బదులుగా గౌహతి బైపాస్‌ను ఉపయోగించాలని షరతు విధించారు.
జనసమూహాన్ని రెచ్చగొట్టినందుకు రాహుల్ గాంధీ పై కేసు
అనంతరం యాత్రను నగరంలోకి రానీయకుండా అడ్డుకోవడంతో కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కాంగ్రెస్ కార్యకర్తలు బారికేడ్లను బద్దలు కొట్టడంతో పోలీసులు వారిని అడ్డుకునేందుకు లాఠీచార్జి చేశారు. అనంతరం నగర శివార్లలో పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులను ఉద్దేశించి రాహుల్ గాంధీ రెచ్చగొట్టారంటూ ఆయనపై కేసు నమోదు చేయాలని డీజీపీ జి.పి.సింగ్‌ను సీఎం ఆదేశించారు. చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీనికి ప్రతిస్పందనగా, హిమంత బిస్వా శర్మ రాహుల్ గాంధీ,కాంగ్రెస్ కార్యకర్తలు నక్సలైట్ వ్యూహాలను ఉపయోగిస్తున్నారని విమర్శించారు. జనసమూహాన్ని రెచ్చగొట్టినందుకు రాహుల్ గాంధీ పై కేసు నమోదు చేయాలని కోరారు.