Page Loader
TamilNadu: తమిళనాడులో గూడ్స్‌ రైలులో మంటలు.. ఐదు వ్యాగన్లు దగ్ధం!
తమిళనాడులో గూడ్స్‌ రైలులో మంటలు.. ఐదు వ్యాగన్లు దగ్ధం!

TamilNadu: తమిళనాడులో గూడ్స్‌ రైలులో మంటలు.. ఐదు వ్యాగన్లు దగ్ధం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 13, 2025
10:39 am

ఈ వార్తాకథనం ఏంటి

తమిళనాడులోని తిరువల్లూరు సమీపంలో ఆదివారం తెల్లవారుజామున తీవ్ర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. డీజిల్‌ లోడ్‌తో ప్రయాణిస్తున్న గూడ్స్ రైలుకు ఆకస్మికంగా మంటలు అంటుకోవడంతో పరిసర ప్రాంతాల్లో విషాదకర పరిస్థితి ఏర్పడింది. చెన్నై పోర్టు నుంచి బెంగళూరుకు ఇండియన్ ఆయిల్ కంపెనీ తరఫున డీజిల్‌ను తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మొత్తం 52 వ్యాగన్లతో వెళ్తున్న ఈ గూడ్స్ రైలు పట్టాలు తప్పిన వెంటనే మంటలు చెలరేగాయని అధికారులు వెల్లడించారు. మంటలు ప్రారంభమైన వెంటనే ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు విస్తృతంగా చర్యలు చేపట్టారు.

Details

రైళ్ల రాకపోకలకు అంతరాయం

ఐదు వ్యాగన్ల వరకు మంటలు వ్యాపించినట్లు సమాచారం. అగ్నిప్రమాదం తీవ్రతతో పరిసర ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకుంది. దీంతో ప్రజలకు ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా ఉండేందుకు అధికారులు అప్రమత్తమయ్యారు. సమీప నివాసాల నుంచి స్థానికులను తొలగించడంతో పాటు, గృహాల్లో ఉన్న గ్యాస్ సిలిండర్లను కూడా బయటకు తీసివేశారు. ప్రమాద పరిధిలో విద్యుత్ సరఫరా తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది. ఈ ఘటన కారణంగా చెన్నై - అరక్కోణం మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రయాణికుల రైళ్లను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించినట్లు రైల్వేశాఖ పేర్కొంది. ప్రమాదంపై పూర్తి స్థాయి దర్యాప్తును ప్రారంభించామని రైల్వే పోలీసులు తెలిపారు. ప్రమాద కారణాలపై విచారణ కొనసాగుతున్నట్లు సమాచారం.