ఎలాంటి చర్చ జరగకుండానే ముగిసిన మణిపూర్ అసెంబ్లీ సమావేశాలు
మణిపూర్ వర్షాకాల సమావేశాలు ఎలాంటి చర్చ లేకుండానే, అర్ధాంతరంగా ముగిశాయి. మణిపూర్‌లో జాతి ఘర్షణలు చెలరేగిన తర్వాత తొలిసారి మంగళవారం సమావేశమైన అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. అసెంబ్లీ సమావేశాలు ఒకరోజు మాత్రమే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో కాంగ్రెస్ వ్యతిరేకించింది. రాష్ట్రంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు 5రోజుల పాటు నిర్వహించాలని కాంగ్రెస్ పట్టుబట్టింది. స్పీకర్ సభలోకి ప్రవేశించిన వెంటనే సమావేశాలను ఐదు రోజులు నిర్వహించాలని కాంగ్రెస్ నినాదాలు చేసింది. దీంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 'సేవ్ డెమోక్రసీ' అనే ప్లకార్డులతో సభకు హాజరయ్యారు. మణిపూర్‌లో శాంతిభద్రతలు ప్రమాదంలో ఉన్నాయని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత ఓ ఇబోబీ అన్నారు.
హింసలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు సీఎం బీరెన్ సానుభూతి
బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలను ఒక రోజు మాత్రమే నిర్వహించాలని నిర్ణయించినట్లు సీఎం బీరెన్ చెప్పారు. అసెంబ్లీ ఆయన కొద్దిసేపు మాట్లాడారు. ప్రస్తుత సంక్షోభానికి సంబంధించి ఇప్పటికే విచారణ ప్రారంభమైందని, ఇది ఇప్పటికే కోర్టులో ఉందని ఆయన అన్నారు. అలాగే చంద్రయాన్ -3ని విజయవంతంగా ప్రయోగించడంపై సీఎం ప్రశంసించారు. చంద్రయాన్-3ని ప్రయోగించడంలో మణిపూర్‌కు చెందిన నింగ్‌థౌజం రఘు చేసిన కృషిని ఆయన గుర్తు చేసారు. రాష్ట్రంలో చెలరేగిన హింసలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు సీఎం సానుభూతిని ప్రకటించారు. అలాగే ఇటీవల చనిపోయిన మాజీ ఎమ్మెల్యేల మృతికి సంతాపం తెలుపుతూ ఒక నిమిషం మౌనం పాటించారు. ఆ తర్వాత విపక్ష ఎమ్మెల్యేల అరుపులతో సభను కొనసాగించలేక నిరవధిక వాయిదా వేశారు.