Page Loader
Cold Wave: ఉత్తరాది రాష్ట్రాల్లో పొగమంచు కారణంగా.. విమాన, రైల్వే సర్వీసులకు అంతరాయం 
ఉత్తరాది రాష్ట్రాల్లో పొగమంచు కారణంగా.. విమాన, రైల్వే సర్వీసులకు అంతరాయం

Cold Wave: ఉత్తరాది రాష్ట్రాల్లో పొగమంచు కారణంగా.. విమాన, రైల్వే సర్వీసులకు అంతరాయం 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 03, 2025
09:18 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర భారతదేశం చలి తీవ్రతతో వణుకుతోంది. పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో మంచు దట్టంగా కురుస్తోంది. పొగమంచు కారణంగా విమానాలు, రైళ్లు ఆలస్యంగా నడుస్తుండటంతో రవాణా సేవలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. భారత వాతావరణ శాఖ ప్రకారం, దిల్లీలో గత 24 గంటల్లో గరిష్ఠ ఉష్ణోగ్రత 16 డిగ్రీలుగా, కనిష్ఠం 7.6 డిగ్రీలుగా నమోదైంది. పొగమంచు తీవ్రత కారణంగా, ఎదురుగా వచ్చే వాహనాలు కనబడని పరిస్థితి నెలకొంది. దిల్లీ ఎయిర్‌పోర్టులో విజిబిలిటీ 50 మీటర్లకు తగ్గిపోయింది. జనవరి 8వ తేదీ వరకు దిల్లీలో మంచు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేయడంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.

వివరాలు 

నోయిడాలో విద్యార్థులకు సెలవులు

అంతేకాక, తేలికపాటి వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. రవాణా సేవలు రద్దు కావడం లేదా ఆలస్యం కావడం వంటి పరిస్థితుల కారణంగా ప్రయాణికులు తమ షెడ్యూల్‌ను ముందుగానే తనిఖీ చేసుకోవాలని విమానయాన సంస్థలు సూచించాయి. ఉత్తర్‌ప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లోనూ పరిస్థితి దాదాపు ఇదే విధంగా ఉంది. చలి తీవ్రత దృష్ట్యా నోయిడాలో 8వ తరగతి వరకు ఉన్న విద్యార్థులకు సెలవులు ప్రకటించారు. బిహార్‌, పంజాబ్‌, రాజస్థాన్‌, హరియాణాలో కూడా దట్టమైన మంచు కురుస్తోంది. రాజస్థాన్‌లోని ఫతేపుర్‌లో గత 24 గంటల్లో కనిష్ఠ ఉష్ణోగ్రత 3.6 డిగ్రీలుగా నమోదైంది.