Nirmala Sitharaman: యూపీఏ హయాంలో బ్యాంకులను ఏటీఎంలా వాడుకున్నారని.. రాహుల్ గాంధీపై ఆర్థికమంత్రి ఫైర్..
సామాన్యుల జీవితానికి కీలకమైన ప్రభుత్వ రంగ బ్యాంకులను కేంద్ర ప్రభుత్వం తమ మోసపూరిత మిత్రులకు అపరిమిత వనరులుగా ఉపయోగిస్తోందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఘాటుగా స్పందించారు. ప్రతిపక్ష నేతల వ్యాఖ్యలు కష్టపడి పనిచేస్తున్న బ్యాంకు ఉద్యోగులను, పటిష్టమైన బ్యాంకింగ్ వ్యవస్థతో లబ్ధిపొందుతున్న పౌరులను అవమానించడమేనని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో బ్యాంకులను ఏటీఎంలా వాడినవారు ఎవరో చెప్పాలని విపక్ష నేతపై ప్రశ్నించారు. ఈ నేపధ్యంలో ఆమె తన అభిప్రాయాలను సుదీర్ఘంగా పోస్ట్ చేశారు.
ప్రభుత్వరంగ బ్యాంకులను ఏటీఎంలా వాడుకున్నారు
నిరాధార ఆరోపణలు చేయడం ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి అమితాసక్తి అని ఆమె ఎద్దేవా చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత ప్రభుత్వ రంగం, ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు చరిత్రాత్మక పురోగతి సాధించాయని నిర్మలమ్మ పేర్కొన్నారు. యూపీఏ హయాంలో నిర్ణయాలరహితంగా కార్పొరేట్ రుణాల మంజూరు వల్ల ప్రభుత్వ రంగ బ్యాంకులు తీవ్రంగా దెబ్బతిన్నాయని గుర్తుచేశారు. ఈ విషయాన్ని రాహుల్ గాంధీ తెలుసుకోకపోవడం ఆశ్చర్యకరమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పాలనలో తమ బంధుమిత్రులు, చీకటి వ్యాపారుల అవసరాలకు ప్రభుత్వరంగ బ్యాంకులను ఏటీఎంలా వాడుకున్నారని విమర్శించారు.
మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలు
''యూపీఏ పాలన సమయంలో బ్యాంకు ఉద్యోగులు తీవ్రంగా వేధింపులకు గురయ్యారు. తమకు అనుకూలంగా ఉన్నవారికే రుణాలు మంజూరు చేయాలని ఫోన్ కాల్‌లు చేసి బెదిరించారు. 2015లో అసెట్ క్వాలిటీ రివ్యూలో ఈ 'ఫోన్ బ్యాంకింగ్' కుంభకోణం వెలుగులోకి వచ్చిందన్న విషయాన్ని మర్చిపోయారా?'' అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలు అమలు చేశామని ఆమె గుర్తుచేశారు. గత పది సంవత్సరాల్లో ప్రభుత్వ బ్యాంకులకు రూ.3.26 లక్షల కోట్ల మూలధనం సమకూర్చామని, అలాగే పీఎం ముద్రా,పీఎం స్వానిధి,విశ్వకర్మ వంటి పథకాల ద్వారా 52 కోట్లకు పైగా తనఖా రహిత రుణాలు మంజూరు చేశామని ఆమె వివరించారు.
54కోట్ల మంది జన్‌ధన్ ఖాతాదారులు
దేశవ్యాప్తంగా 54కోట్ల మంది జన్‌ధన్ ఖాతాదారులు ఉన్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో, రాహుల్ గాంధీ బుధవారం అఖిల భారత బ్యాంకింగ్ అధికారుల సమాఖ్య ప్రతినిధులతో సమావేశమై, అనంతరం కేంద్రంపై ఎక్స్‌లో తన విమర్శలు చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకులపై లాభాలను అధిక ప్రాధాన్యతగా చూపి ప్రజాప్రయోజనాలను దూరం చేయాలని ఒత్తిడి పెరుగుతోందని ఆయన ఆరోపించారు.