Page Loader
India: వక్ఫ్‌ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్‌లో ఆందోళనలపై బంగ్లా వ్యాఖ్యలు.. తోసిపుచ్చిన భారత్
వక్ఫ్‌ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్‌లో ఆందోళనలపై బంగ్లా వ్యాఖ్యలు.. తోసిపుచ్చిన భారత్

India: వక్ఫ్‌ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్‌లో ఆందోళనలపై బంగ్లా వ్యాఖ్యలు.. తోసిపుచ్చిన భారత్

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 18, 2025
12:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్‌లో ఇటీవల జరిగిన ఆందోళనలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌కు చెందిన ఒక అధికారి చేసిన వ్యాఖ్యలు మరో వివాదానికి తెరతీశాయి. ఈ వ్యాఖ్యలపై తాజాగా భారత్‌ విదేశాంగశాఖ తన అధికారిక స్పందనను వెల్లడించింది. భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్‌ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ.. బంగ్లాదేశ్‌ అధికారుల వ్యాఖ్యలు అసంబద్ధమైనవని విమర్శించారు. బంగ్లా ప్రెస్‌ సెక్రటరీ షఫీకుల్‌ ఆలం చేసిన వ్యాఖ్యలు తగినవిగా లేవని పేర్కొన్నారు. బదులుగా, బంగ్లాదేశ్‌ ప్రభుత్వం తమ దేశంలోని మైనార్టీల హక్కులను రక్షించేందుకు చర్యలు తీసుకోవడంపై దృష్టి సారించాలి అని హితవు పలికారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ, జైస్వాల్ ఈ వ్యాఖ్యలు చేశారు.

వివరాలు 

తమ దేశంలో మైనార్టీల హక్కుల రక్షణపై కేంద్రీకరించాలి

బంగ్లాదేశ్‌ ప్రెస్‌ సెక్రటరీ షఫీకుల్‌ ఆలం మాట్లాడుతూ.. భారతదేశంలోని మైనారిటీ వర్గాల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వంతో పాటు పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై జైస్వాల్‌ తీవ్రంగా స్పందిస్తూ.. "పశ్చిమ బెంగాల్‌లో జరిగిన పరిణామాలపై బంగ్లాదేశ్‌ అధికారుల వ్యాఖ్యలను భారత్ ఖండిస్తోంది. ఈ వ్యాఖ్యలు అర్థరహితంగా, నిరాధారంగా ఉన్నాయి. బంగ్లాదేశ్‌లోని మైనారిటీలపై జరుగుతున్న అప్రతిష్ఠకర ఘటనలపై భారత్ ఇప్పటికే గంభీరంగా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో వారు మాపై విమర్శలు చేయడం సరైంది కాదు. బదులుగా తమ దేశంలో మైనార్టీల హక్కుల రక్షణపై కేంద్రీకరించాలి," అని స్పష్టం చేశారు.

వివరాలు 

 హింసాత్మక ఘటనల వెనుక ఉగ్రవాద సంస్థల పాత్ర: ఇంటెలిజెన్స్‌ వర్గాలు

ఇక వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా,ముర్షిదాబాద్‌,దక్షిణ 24 పరగణాలు,హూగ్లీ జిల్లాల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు రోడ్డెక్కారు. ముఖ్యంగా ముర్షిదాబాద్‌ జిల్లాలో ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి.అక్కడ కొంతమంది నిరసనకారులు పోలీసు వాహనాలకు నిప్పుపెట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనలలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, 200 మందికిపైగా నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనలపై స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ఈ వక్ఫ్ చట్టాన్ని పశ్చిమ బెంగాల్‌లో అమలు చేయబోమని స్పష్టంగా ప్రకటించారు. అయితే, జరిగిన హింసాత్మక ఘటనల వెనుక ఉగ్రవాద సంస్థల పాత్ర ఉందని ఇంటెలిజెన్స్‌ వర్గాలు సూచిస్తున్నాయి. ఈ సంస్థలు యువతను మభ్యపెట్టి, దాడులకు ప్రేరేపిస్తున్నట్లు సమాచారం అందినట్లు తెలుస్తోంది.