Ap news: ఓడల నిర్మాణం.. మరమ్మతు కేంద్రాలకు ప్రోత్సాహం.. మారిటైం పాలసీ విధివిధానాలు ఖరారు
తీరప్రాంత అభివృద్ధి ద్వారా ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించడం మారిటైం పాలసీ ప్రధాన లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రం సముద్ర ఎగుమతుల్లో కీలకంగా మారేందుకు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం అవసరమని స్పష్టం చేసింది. ఈ లక్ష్య సాధనకు మారిటైం పాలసీ దోహదం చేస్తుందని అభిప్రాయపడింది. పాలసీ విధివిధానాలు, అమలు మార్గదర్శకాలను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నౌకాశ్రయాల అభివృద్ధి, పారిశ్రామికీకరణ, నౌకా నిర్మాణ క్లస్టర్లు, లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలు, మారిటైం సేవలు, పర్యావరణ సుస్థిరత, నైపుణ్యాభివృద్ధి వంటి లక్ష్యాలను సాధించడానికి ఈ విధానాలను రూపకల్పన చేసింది. పోర్టుల నిర్వహణ, మారిటైం కార్యకలాపాలకు సంబంధించి సింగిల్ విండో విధానంలో అనుమతులు అందించనుంది.
అభివృద్ధికి అనువైన వాతావరణం
2030 నాటికి మారిటైం రంగంలో దేశంలోని ప్రధాన రాష్ట్రంగా అభివృద్ధి చెందడమే ప్రభుత్వ లక్ష్యం. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్స్ ఆధారంగా సుస్థిర అభివృద్ధిని అందించడమే దీని పునాది. మారిటైం పరిశ్రమ రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదం చేయడమే కాకుండా గణనీయమైన ఉపాధి అవకాశాలను కల్పించగలదని ప్రభుత్వం విశ్వసిస్తోంది. తీరప్రాంత ప్రజలకు, భాగస్వామ్య పక్షాలకు ప్రయోజనం చేకూర్చే విధంగా సుస్థిర అభివృద్ధిని ఉద్భవింపజేయడం కూడా పాలసీ లక్ష్యాల్లో కీలక అంశంగా ఉంది.
ముఖ్యమైన చర్యలు
పోర్టుల్లో టెర్మినల్స్ అభివృద్ధి చేయడం ద్వారా సరకు రవాణా సామర్థ్యాన్ని పెంచడం, పారిశ్రామిక క్లస్టర్లు, లాజిస్టిక్స్ సెంటర్లు, పట్టణీకరణ ద్వారా ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించడం, ఆధునిక షిప్‌యార్డులు, మరమ్మతుల కేంద్రాలు ఏర్పాటు చేయడం, షిప్ బిల్డింగ్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడం ముఖ్య లక్ష్యాలుగా ఉన్నాయి. పాలసీ లక్ష్యాలు ప్రపంచ స్థాయి 20 పోర్టుల్లో కనీసం ఒక పోర్టు మన రాష్ట్రం నుంచి ఉండేలా చేయడం. 2047 నాటికి దేశం మొత్తం ఎగుమతుల్లో 20 శాతం మన రాష్ట్రం నుంచి ఉండేలా చూడడం. 2030 నాటికి పోర్టుల సామర్థ్యంలో 75 శాతం వినియోగం సాధించడం. మారిటైం విశ్వవిద్యాలయం, నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి 2028 నాటికి 5 వేలమందికి శిక్షణ అందించడం.
ఓడల నిర్మాణంలో జాతీయ స్థాయిలో 25 శాతం వాటా
గ్లోబల్ షిప్‌యార్డ్ స్థాపన ద్వారా 2047 నాటికి ఓడల నిర్మాణంలో జాతీయ స్థాయిలో 25 శాతం వాటా సాధించడం. ఈ విధంగా, మారిటైం పాలసీ ద్వారా రాష్ట్రం ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు సాగేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.