Kejriwal: ఈడీ విచారణకు మరోసారి డుమ్మా కొట్టనున్నఅరవింద్ కేజ్రీవాల్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దిల్లీ మద్యం పాలసీ కేసులో ఈడీ విచారణను దాటవేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. లిక్కర్ స్కామ్ కేసులో శుక్రవారం ఈడీ విచారణకు హాజరుకావాలంటూ జనవరి నెలాఖరున అధికారులు సమన్లు జారీ చేశారు. ఆయా కారణాలతో నాలుగుసార్లు కేజ్రీవాల్ విచారణకు హాజరుకాలేదు. ఈడీ సమన్ల పై ఆప్ పార్టీ ప్రతినిధులు మాట్లాడుతూ "కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడమే మోడీ జీ లక్ష్యం" అని ఆరోపించింది. ప్రధానమంత్రి కేజ్రీవాల్ అరెస్టు చేయడం ద్వారా ఢిల్లీ ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకుంటున్నారు" అని పేర్కొంది.
విచారణకు హాజరుకాకపోతే.. కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసే అవకాశం
కేజ్రీవాల్ 2023లో నవంబర్ 2, డిసెంబర్ 21,ఈ ఏడాది జనవరి 3, జనవరి 18 తేదీలకు సంబంధించిన ED సమన్లను దాటవేశారు. ఈసారి మాత్రం విచారణకు హాజరుకాకపోతే ఈడీ అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అధికారులు న్యాయస్థానాన్ని ఆశ్రయించే ఛాన్స్ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రకారం, లిక్కర్ వ్యాపారులకు లైసెన్సులు మంజూరు చేయడానికి 2021-22కి ఢిల్లీ ప్రభుత్వం ఎక్సైజ్ పాలసీ కార్టలైజేషన్‌ను అనుమతించింది. దాని కోసం లంచాలు చెల్లించినట్లు ఆరోపించిన కొంతమంది డీలర్‌లకు ఆప్ పార్టీ అనుకూలంగా ఉంది.
ఈరోజు ఆప్,బీజేపీ నిరసనలకు ప్లాన్
ఈరోజు దేశ రాజధానిలో ఆప్,బీజేపీ రెండూ ఏకకాలంలో నిరసనలకు ప్లాన్ చేశాయి. ప్రదర్శనల దృష్ట్యా సెంట్రల్ ఢిల్లీలో అదనపు సిబ్బందిని మోహరించడంతో భద్రతను పెంచారు. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ బీజేపీ ప్రధాన కార్యాలయం వెలుపల ఆప్ నిరసనకు దిగనుంది. కేజ్రీవాల్ పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌తో కలిసి నిరసనలో పాల్గొననున్నారు. ఇదిలా ఉండగా, అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా తమ సభ్యులు ఆప్ ప్రధాన కార్యాలయం దగ్గర నిరసన తెలుపుతారని బీజేపీ తెలిపింది.