వచ్చే పదేళ్ల వరకు మీ సామాజిక వర్గం ఓట్లు బీజేపీకి అవసరం లేదు: అసోం సీఎం కీలక వ్యాఖ్యలు
అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తరుచూ తన ప్రకటనతో వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. వచ్చే పదేళ్లపాటు బీజేపీకి 'మియా' సామాజిక వర్గం ఓట్లు ఓట్లు అవసరం లేదని శర్మ తేల్చి చెప్పారు. బెంగాలీ మాట్లాడే ముస్లింలను 'మియా' అని పిలుస్తుంటారు. బాల్య వివాహాల వంటి పద్దతులను పక్కనబెట్టి తమను తాము సంస్కరించుకునేంత వరకు 'మియా'ల ఓట్లు తమకు అవసరం లేదని పేర్కొన్నారు. వాస్తవానికి 'మియా' ప్రజలు తనకు, ప్రధాని నరేంద్ర మోదీకి, బీజేపీకి మద్దతు ఇస్తున్నారని శర్మ చెప్పుకొచ్చారు. అయితే తమకు ఓటు మాత్రం వేయకుండా, మద్దతుగా నిలువొచ్చని చెప్పడం గమనార్హం.
బీజేపీకి ఓటు వేయకపోవడం వల్ల వచ్చే నష్టమేమీ లేదు: హిమంత శర్మ
మియాలు తమకు ఓటు వేయకపోవడం వల్ల వచ్చే నష్టమేమీ లేదని హిమంత శర్మ అన్నారు. కుటుంబ నియంత్రణ పాటిస్తూ, బాల్య వివాహాలను అరికట్టి, ఛాందసవాదాన్ని దూరం పెట్టినప్పుడే తమకు ఓటు వేయాలని కోరారు. ఇవన్నీ జరగాలంటే, 10 ఏళ్లు పడుతుందని, అందుకే అప్పటి వరకు ఓటు వేయొద్దన్నారు. బీజేపీకి ఓటు వేసే వారు ఇద్దరు, ముగ్గురు పిల్లల కంటే ఎక్కువ ఉండకూడదని, తమ కూతుళ్లను తప్పనిసరిగా పాఠశాలలకు పంపాలన్నారు. బెంగాలీ మాట్లాడే ముస్లింలు ఎక్కువగా నివసించే అనేక 'చార్' ప్రాంతాల్లో పాఠశాలలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాబోయే రోజుల్లో మైనారిటీ ప్రాంతాల్లో ఏడు కళాశాలలను ప్రారంభిస్తామని శర్మ చెప్పారు.