Page Loader
Naveen Chawla: మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ నవీన్ చావ్లా కన్నుమూత
మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ నవీన్ చావ్లా కన్నుమూత

Naveen Chawla: మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ నవీన్ చావ్లా కన్నుమూత

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 01, 2025
04:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) నవీన్ చావ్లా శనివారం 79 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు. మెదడుకు శస్త్రచికిత్స కోసం దిల్లీలోని ఆపోలో ఆసుపత్రిలో చేరిన ఆయన, చికిత్స పొందుతుండగా మరణించారు. ఈ విషయాన్ని మరో మాజీ సీఈసీ ఎస్‌వై ఖురైషి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. నవీన్ చావ్లా 2005 నుండి 2009 వరకు ఎన్నికల కమిషనర్‌గా (ఈసీ) సేవలందించారు. అనంతరం 2009 ఏప్రిల్ నుండి 2010 జూలై వరకు ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ)గా పని చేశారు.

Details

 వివాదాల్లో నవీన్ చావ్లా

ఎన్నికల సంఘంలో పనిచేసే సమయంలో నవీన్ చావ్లా పలు వివాదాల్లో చిక్కుకున్నారు. ప్రతిపక్ష బీజేపీ, ఆయనపై పక్షపాత ధోరణితో వ్యవహరించారని ఆరోపించింది. 2006లో, ప్రతిపక్ష నేత ఎల్‌కే అద్వానీ నేతృత్వంలోని 204 మంది ఎంపీలు, నవీన్ చావ్లాను ఎన్నికల కమిషనర్‌ పదవి నుంచి తొలగించాలని కోరుతూ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాంకు పిటిషన్ సమర్పించారు. బీజేపీ ఈ అంశంపై సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది. 2009లో అప్పటి సీఈసీ ఎన్. గోపాలస్వామి, నవీన్ చావ్లాను ఎన్నికల కమిషనర్‌గా తొలగించాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు.

Details

ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా పదోన్నతి

అయితే కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఆయనను ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా పదోన్నతి కల్పించింది. అనంతరం నవీన్ చావ్లా ఎన్నికల కమిషనర్ల భద్రత కోసం చట్ట సవరణ సిఫార్సు చేశారు. అదనంగా థర్డ్ జండర్‌ను 'ఇతరులు' కేటగిరీలో ఓటర్లుగా నమోదు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ప్రస్తావించారు.

Details

 సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో ఉన్నత విద్య

నవీన్ చావ్లా 1945 జూలై 30న జన్మించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని సనావర్‌లో ఉన్న ది లారెన్స్ స్కూల్‌లో విద్యనభ్యసించిన ఆయన, తర్వాత దిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో ఉన్నత విద్య పూర్తిచేశారు. సివిల్ సర్వీస్‌లో అనేక కీలక బాధ్యతలు నిర్వహించారు. కేంద్రపాలిత ప్రాంతాల్లో కొంతకాలం పనిచేసినా ఎక్కువ భాగం దిల్లీలోనే ఉద్యోగ జీవితాన్ని గడిపారు. ఇక ఎన్నికల కమిషనర్‌గా నియామకానికి ముందు కేంద్ర కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు. 2009 లోక్‌సభ ఎన్నికలను పర్యవేక్షించిన చావ్లా, మదర్ థెరిసా జీవిత చరిత్రపై పుస్తకాలు కూడా రచించారు.