
Supreme Court: మాజీ న్యాయమూర్తులకు సమాన పెన్షన్ ఇవ్వాలి: సుప్రీం ఆదేశాలు
ఈ వార్తాకథనం ఏంటి
హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తుల కొందరికి తక్కువ పెన్షన్ లభిస్తున్నదంటూ వచ్చిన ఫిర్యాదులపై సుప్రీంకోర్టు కీలకంగా స్పందించింది.
ఈ అంశంపై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం, అన్ని హైకోర్టుల మాజీ న్యాయమూర్తులకు సమానంగా పూర్తి పెన్షన్ అందించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
ఉద్యోగంలో చేరిన తేదీ, ఇతర ప్రమాణాలతో సంబంధం లేకుండా, అన్ని హైకోర్టులలో పని చేసిన న్యాయమూర్తులు పూర్తి స్థాయిలో పెన్షన్‌కు అర్హులని ధర్మాసనం స్పష్టం చేసింది.
అలాగే జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) న్యాయమూర్తులు, జిల్లా న్యాయమూర్తులకు కూడా పదవీ విరమణ అనంతరం సమాన ప్రయోజనాలు అందించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
Details
కుటుంబ పెన్షన్ వంటి ప్రయోజనాలు
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి నేతృత్వంలోని ధర్మాసనం, న్యాయవ్యవస్థకు ఉన్న స్వాతంత్ర్యాన్ని కాపాడేందుకు, వారి గౌరవాన్ని నిలుపుకునేందుకు శాశ్వత, అదనపు న్యాయమూర్తుల మధ్య తేడాలు ఉండకూడదని అభిప్రాయపడింది.
వారి వితంతువులు, ఆధారపడిన కుటుంబ సభ్యులకు గ్రాట్యూటీ, కుటుంబ పెన్షన్ వంటి ప్రయోజనాలు కూడా సమంగా లభించాలన్నారు.
పదవీవిరమణ అనంతరం పెన్షన్, ఇతర టెర్మినల్ ప్రయోజనాల విషయంలో వివక్ష చూపడాన్ని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ఉల్లంఘనగా పరిగణించిన ధర్మాసనం, అన్ని హైకోర్టుల మాజీ ప్రధాన న్యాయమూర్తులకు ప్రతి సంవత్సరం రూ.15 లక్షల పెన్షన్, సాధారణ రిటైర్డ్ న్యాయమూర్తులకు రూ.13.5 లక్షల పూర్తి పెన్షన్ చెల్లించాలని కేంద్రాన్ని ఆదేశించింది.