Abhijit: కాంగ్రెస్‌లోకి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తనయుడు.. టీఎంసీపై తీవ్ర విమర్శలు
ఈ వార్తాకథనం ఏంటి
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమారుడు అభిజిత్ ముఖర్జీ బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.
కోల్‌కతాలోని రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయంలో, పశ్చిమ బెంగాల్ ఇన్‌చార్జ్ గులాం అహ్మద్ మీర్, జమ్మూ కశ్మీర్‌కు చెందిన ఓ ఎమ్మెల్యే సమక్షంలో ఆయన హస్తం పార్టీ సభ్యత్వం స్వీకరించారు.
2012లో జంగిపూర్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఎంపీగా విజయం సాధించిన అభిజిత్, 2014లోనూ అదే నియోజకవర్గం నుంచి మరోసారి పార్లమెంటుకు ఎన్నికయ్యారు.
అయితే 2019లో ఓటమి చవిచూశారు. అనంతరం 2021లో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి తృణమూల్ కాంగ్రెస్‌లో (టీఎంసీ) చేరారు. ఇప్పుడు, నాలుగు సంవత్సరాల తరువాత, మళ్లీ కాంగ్రెస్‌లోకి తిరిగి వచ్చారు.
వివరాలు
టీఎంసీలో చేరటం పొరపాటే
కాంగ్రెస్‌లో చేరిన అనంతరం అభిజిత్ ముఖర్జీ టీఎంసీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
తాను టీఎంసీలో చేరటం ఓ పెద్ద తప్పుగా భావిస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్‌లో తనకు లభించిన గౌరవం ఎక్కడా దొరకలేదని తెలిపారు.
దేశ విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడే ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ లేకుండా దేశ ఐక్యత అసాధ్యమని వ్యాఖ్యానించారు.
విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటం చేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని, మరే ఇతర పార్టీ ఆ స్థాయిలో నిలబడలేదని అన్నారు.
వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, అభిజిత్ టీఎంసీ నుంచి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరటం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.