సీఎం జగన్‌తో తెలంగాణ మాజీ ఎంపీ పొంగులేటీ భేటీ
రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో తెలంగాణ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొంగులేటీ శ్రీనివాస్ రెడ్డి గురువారం భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ ను పొంగులేటి కలిసినట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత వైసీపీ నుంచి గెలిచిన పొంగులేటి తదనంతర పరిస్థితుల నేపథ్యంలో బీఆర్ఎస్‌లోకి చేరారు. ఇటీవల రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన పొంగులేటి ఏపీ సీఎంతో భేటి కావడంతో సర్వత్రా ఆసక్తి పెరిగింది. సీఎం జగన్‌తో పొంగులేటికి మంచి సంబంధాలు ఉన్నాయి.
కాంగ్రెస్ లోకి షర్మిల అంటూ జోరుగా వార్తలు
సీఎం జగన్, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసుల రెడ్డి భేటీ వెనుక బలమైన కారణం ఉందంటూ జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ లో వైఎస్ షర్మిల పార్టీ చేరికకు సంబంధించి జగన్ పొంగులేటీతో భేటీలో చర్చించారని వార్తలు వస్తున్నాయి. ఏదిఏమైనా వీరి భేటీ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. షర్మిల కాంగ్రెస్ లోకి చేరుతారనే ప్రచారం గత కొంత కాలంగా బలంగా వినిపిస్తున్న విషయం తెలిసిందే.