అక్కపై గ్యాంగ్‌రేప్, చెల్లెపై వేధింపులు.. భాజపా నేత కుమారుడి లీలలు
మధ్యప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. దతియా జిల్లాకు చెందిన ఓ యువతిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ క్రమంలోనే యువతి చెల్లె (మైనర్)పైనా లైంగికంగా దాడి చేశారు. ఈ ఘటనతో మనస్తాపం చెందిన బాధిత యువతి బలవన్మరణానికి యత్నించింది. ప్రస్తుతం బాధితురాలు ఝాన్సీ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ నేపథ్యంలోనే బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం దర్యాప్తు చేసిన పోలీసులు ఓ యువకుడితో పాటు ఇద్దరు మైనర్లను అరెస్ట్ చేశారు. నాలుగో వ్యక్తి ఆచూకీ కోసం రూ.10వేల రివార్డు ప్రకటించారు. అంతకుముందు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ బాధిత కుటుంబీకులు ఠాణా ఎదుట నిరసన తెలిపారు.
మధ్యప్రదేశ్ హోంశాఖ మంత్రి ఇలాకాలో అత్యాచారం
ఈ కేసులో ఓ బీజేపీ నేత కుమారుడు (మైనర్) నిందితుడిగా ఉన్నాడు. సదరు యువకులు తనతోపాటు తన అక్కని అపహరించి ఓ ఇంట్లోకి ఎత్తుకెళ్లారని బాలిక పోలీసులకు తెలిపింది. అక్కడ తన అక్కపై సామూహిక అత్యాచారం చేసి, తనను లైంగికంగా వేధించినట్లు ఫిర్యాదు చేసింది. ఇంటికి చేరుకున్నాక యువతి ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు సమాచారం. నిందితులపై గ్యాంగ్ రేప్, పోక్సో కింద కేసులు నమోదు చేశారు. అత్యాచార ఘటన దురదృష్టకరమని దతియా బీజేపీ అధ్యక్షుడు సురేంద్ర అన్నారు. తమ పార్టీ నేత కొడుకు పేరు ఎఫ్ఐఆర్ లో ఉంటే చర్యలు చేపడతామన్నారు. సాక్షాత్తు మధ్యప్రదేశ్ హోంశాఖ మంత్రి నరోత్తమ్ మిశ్రా ప్రాతినిథ్యం వహిస్తున్న దతియాలో ఘటన జరిగింది.