
Free Bus: మహిళల కోసం ఉచిత బస్సు సౌకర్యం ప్రారంభం… బస్సులో ప్రయాణించిన సీఎం చంద్రబాబు, పవన్
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించే 'స్త్రీ శక్తి' పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ స్వయంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించి, ఉచిత బస్సు ప్రయాణానికి నాంది పలికారు. ఎన్నికల హామీని నిలబెట్టుకుంటూ మహిళల కోసం ఈ ముఖ్య పథకాన్ని నేటి నుంచే అమల్లోకి తెచ్చారు. ఈ కార్యక్రమం కోసం ఉండవల్లి నుంచి తాడేపల్లి, కనకదుర్గ వారధి మీదుగా విజయవాడ బస్ టెర్మినల్ వరకు చంద్రబాబు, పవన్, లోకేశ్ బస్సులోనే ప్రయాణించారు. వారితో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌తో సహా పలు కూటమి నేతలు కూడా ఈ ప్రయాణంలో పాల్గొన్నారు.
Details
సంతోషం వ్యక్తం చేస్తున్న మహిళలు
మహిళా ప్రయాణికులతో కలిసి ప్రయాణిస్తూ, వారి ఆనందంలో భాగమయ్యారు. , మంత్రులు ప్రయాణిస్తున్న బస్సు వెళ్లే మార్గంలో, పెద్ద సంఖ్యలో మహిళలు గుమిగూడి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. దారిపొడవునా మంగళహారతులు, నీరాజనాలతో ఘన స్వాగతం పలికారు . "థాంక్యూ సీఎం సర్" అంటూ నినాదాలు చేస్తూ తమ కృతజ్ఞతలు తెలియజేశారు. కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, నేతలు పలు ప్రాంతాల్లో బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ముఖ్య వాగ్దానాల్లో ఒకటైన ఈ పథకాన్ని అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేయడం పట్ల రాష్ట్రవ్యాప్తంగా మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.